తెలుగు సినిమా మార్కెట్ నిరంతరం హాట్ టాపిక్. ప్రస్తుతం బిజినెస్ రకరకాల కోణాల్లో పెరిగింది. ఇప్పుడు నడిచేదంతా గోల్డెన్ డేస్ అని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా శాటిలైట్, డిజిటల్ బిజినెస్ పెరగడంతో మంచి రోజులొచ్చాయని నిర్మాతలంతా ఉత్సాహంగా సినిమాలు తీస్తున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాలతో పాటు మీడియం రేంజ్, చిన్న బడ్జెట్ సినిమాలకు కంటెంట్ బావుంటే శాటిలైట్ హక్కులకు భారీ మొత్తాల్ని చెల్లించేందుకు ఎంటర్‌టైన్‌మెంట్ చానెళ్లు ఆఫర్లు ఇస్తుండడంతో ఆ మేరకు నిర్మాతల్లోనూ ఉత్సాహం నెలకొంది. దీనికి డిజిటల్ రైట్స్ డిమాండ్ మరింత ఊతం ఇస్తోంది.
టాలీవుడ్‌లో శాటిలైట్ రైట్స్ పరంగా ఓ మూడు చానెళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఆ ముగ్గురూ ఒకరితో ఒకరు పోటీపడుతూ రేట్లు పెంచడం నిర్మాతలకు కలిసొస్తోంది. 2019లో రిలీజై హిట్లు కొట్టిన చాలా సినిమాలకు శాటిలైట్ రేంజు అదిరిందన్న టాక్ ఉంది. పోటీ వల్లనే అది సాధ్యమైంది. అయితే అనూహ్యంగా ఈ రేసులోంచి ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్ జీ-తెలుగు తప్పుకోవడంతో పోటీ ఒక్కసారిగా దిగాలైపోయిందని చెబుతున్నారు. ఇటీవలే వార్షికాదాయంపైనా.. పెడుతున్న పెట్టుబడులపైనా జీ-చానెల్ రివ్యూ చేసుకుందట. అయితే సరైన టీఆర్పీలు లేక యాడ్స్ రెవెన్యూ లేకపోవడంతో ఇకపై సినిమాలు కొనే శాతం తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం కొంతకాలంపాటు సినిమాలు కొనకూడదని నిర్ణయించుకుందట. దీంతో ఇకపై స్టార్ మా, సన్- జెమినీ టీవీల మధ్య మాత్రమే హక్కుల్లో పోటీ ఉంటుంది. ఆ రెండు చానెళ్లు ఎంత చెబితే అంతకు నిర్మాతలు తల ఊపాల్సిన పరిస్థితి తలెత్తనుందట. వీళ్లతో పాటు ఇక వేరొక చానెల్ ఏదీ పోటీలో లేకపోవడంతో ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఈటీవీ ఎప్పుడూ రేసులో లేదు. రామోజీ సొంత బ్యానర్ సినిమాలే కానీ బయటివి కొనరు. దీంతో ఫ్యాన్సీ ధరలు పెరిగేందుకు ఛాన్సే లేదని విశ్లేషిస్తున్నారు. రెండే చానెళ్లు ఉంటాయి కాబట్టి ఆ ఇద్దరూ అంతర్గతంగా ప్రతిదీ కట్టడి చేస్తూ డీల్ మాట్లాడుకున్నా ఆశ్చర్యం అక్కర్లేదని ఆందోళన వ్యక్తమవుతోంది నిర్మాతల్లో.