ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టాలీవుడ్ లో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారా? అఖిల ప్రియ తన వ్యాపారాల్లో భాగంగా సినిమా నిర్మాణ రంగంవైపు మొగ్గుచూపుతున్నారా? అంటే అవుననే సమాచారం అందుతోంది. ప్రస్తుతం అఖిల ప్రియ టీడీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోనూ లేదు..అఖిల ప్రియ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే భూమా బినామీ ఏవీ సుబ్బారెడ్డితో విబేధాలు భగ్గుమన్న నేపథ్యంలో అఖిల ప్రియ పేరు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆ ఇద్దరి మధ్య వివాదం తెలుగు రాష్ర్టాల్లో ఓ సంచలనం. ఈ నేపథ్యంలోనే అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ తో కలిసి సినిమాలు నిర్మించడానికి సిద్దమవుతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఇండస్ర్టీలో తమకున్న పరిచయాలతో నిర్మాణం వైపు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
అయితే ఇందులో నేరుగా అఖిల ప్రియ పెట్టుబడులు పెడతారా? బినామీలను రంగంలోకి దించుతారా? అన్నది చూడాలి. ఇక అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి తెలిసిందే. భూమా వారసురాలిగానే అఖిలప్రియ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి చక్రం తిప్పుతున్నారు. నాగిరెడ్డి మంచి కళా పిపాసి కూడా. సినిమాలంటే అమితాసక్తి చూపించేవారు. ఆ ఇంట్రెస్ట్ తోనే వీరబ్రహ్మేంద్ర క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలను నిర్మించారు. `నా కూతురు` అనే సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించారు. అలాగే సుమన్ హీరోగా పలు సినిమాలను నిర్మించారు.
టాలీవుడ్ టాప్ స్టార్లు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల సహా పలువురి సెలబ్రిటీలతో భూమాకి మంచి పరిచయాలు ఉన్నాయి. అయితే భూమాకి సినిమాల పట్ల ఉన్నఆసక్తి గురించి కొద్ది మందికే తెలుసు. సినిమా రంగంలో కూడా రాణించాలని ప్రయత్నాలు చేసారు. కానీ అనుకున్నంతగా అక్కడ సక్సెస్ కాలేకపోయారు. తాజాగా అఖిల ప్రియ ఎంట్రీ తో తండ్రి సినిమా ఆశయాన్ని కుమార్తెగా నెరవేర్చడానికి ముందుకు వస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.