వేధింపుల కేసుపై భానుప్రియ వెర్షన్ ఇదీ

సినీనటి భానుప్రియ తన కుమార్తెను నిర్బంధించిందని సామర్లకోట పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయం వైరల్ గా మారింది. దాంతో తనపై వచ్చిన ఆరోపణలపై సినీ నటి భానుప్రియ స్పందించారు. ప్రభావతి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇంట్లో దొంగిలించిన వస్తువులను అడిగినందుకు తిరిగి తమపైనే కేసు పెట్టారని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు.

భానుప్రియ మాట్లాడుతూ…ఏడాది నుంచి బాలిక తమ వద్ద పనిచేస్తోందని భానుప్రియ తెలిపారు. ఇంట్లో ఉన్న డబ్బు, ఇతర వస్తువులు కనిపించకపోవడంతో ఆమెను నిలదీశామని చెప్పారు. దొంగిలించిన నగదు, వస్తువులను బాలిక తన తల్లికి ఇచ్చేదని, పోలీసులకు చెబుతామని హెచ్చరించే సరికి బాలిక తన తప్పును అంగీకరించిందన్నారు.

ఇదే విషయమై ఆమె తల్లిని ప్రశ్నించడంతో చెన్నై వచ్చి ఐప్యాడ్‌, వాచ్‌, కెమెరా ఇచ్చిందని తెలిపారు. మిగిలిన వస్తువులు తీసుకొస్తానని చెప్పి సామర్లకోట వెళ్లి తనపై ఫిర్యాదు చేసిందని చెప్పారు.

కేసు వివరాల్లోకి వెళితే..

సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే నిరుపేద మహిళ, ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తాను ఇళ్లలో పనిచేసుకుని బతుకుతోంది. అదే క్రమంలో తెలిసున్న వారి ద్వారా ఏడాది క్రితం తన కూతురు సంధ్యను కూడ భానుప్రియ వద్ద పనికి పెట్టింది. మొదట్లో తన కుమార్తెని తరచుగా ఇంటికి పంపుతూ, ఫోన్ లో మాట్లాడిస్తూ బాగానే ఉండేవారు. కానీ ఇప్పుడు తన కుమార్తెని వేధిస్తున్నారు అంటూ ప్రభావతి వాపోయింది.

భానుప్రియ సోదరుడు తన కుమర్తె పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నాడని సంచలన విషయాన్ని బయట పెట్టింది. అతడు తరచుగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని అన్నారామె. తన కుమార్తెని ఇంటికి పంపండి అని ప్రాధేయపడినా అంగీకరించడం లేదు. పైగా దొంగతనం కేసులు పెడతాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని భాదితురాలి తల్లి పేర్కొంది. దాంతో ప్రభావతి ఛైల్డ్‌లైన్‌ 1098 సహాయం కోరింది. దీంతో.. ఛైల్డ్‌లైన్‌ ప్రతినిధులు భానుప్రియపై పోలీసులకు ఫిర్యాదు ఛేశారు.

ఆర్థిక పరిస్థితి బాగాలేక, చుట్టుపక్కల వాళ్ళ సలహాతోనే ఈ పని చేశానని ప్రభావతి తెలిపింది. తన కుమార్తెకు ప్రస్తుతం 14ఏళ్ల వయసు అని ఆమె వివరించింది.