సినిమా ఆపినందుకు ప్రభుత్వంకి సుప్రీం కోర్ట్ జరిమానా

ధియోటర్ లో రిలీజైన సినిమా ఆపినందుకు సుప్రింకోర్ట్ జరిమానా విధించిన సంఘటన అంతటా చర్చనీయాంసంగా మారింది. భోబిశ్యోతర్‌ భూత్‌ అనే బెంగాళి సినిమా ప్రదర్శనను అడ్డుకున్నందుకు బెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ.20 లక్షల జరిమానా విధించింది.

ఈ సినిమా 2018 నవంబర్‌లో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ పొందింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 15న బెంగాల్‌లో 48 థియేటర్లలో విడుదల చేశారు. ఈ చిత్ర ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలంటూ రాష్ట్ర పోలీసు స్పెషల్‌ బ్రాంచ్‌ నుంచి నిర్మాతకు తాఖీదులు అందాయి.

ఈ సినిమాలో సన్నివేశాలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. థియేటర్లపై దాడులు జరిగాయి. 46 థియేటర్లలో ప్రదర్శనను ఆపేశారు. దీంతో చిత్ర నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు పౌరుల వాక్‌ స్వాతంత్య్రానికి విఘాతం కలిగించే శక్తులకు పావులుగా మారారు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

సినిమా థియేటర్ల యజమానులకు నష్టం కలిగించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల జరిమానా చెల్లించాలని, కోర్టు ఖర్చుల కింద నిర్మాతకు మరో రూ.లక్ష చెల్లించాలని ధర్మాసనం తీర్పు వెలువరించింది. చిత్రకథ భూతాల చుట్టూ తిరుగుతుంది. ఈ భూతాల్లో ఒక రాజకీయనేత ఉంటాడు. వీరంతా శరణార్థి శిబిరంలో ఉండగా జరిగే సమకాలీన ఘటనలపై కథ నడుస్తుంది.