కాపీ క్యాట్ వివాదాలు టాలీవుడ్ ని ఊపేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ తరహా కేసులో టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అడ్డంగా బుక్కవ్వడం చర్చకొచ్చింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ `బ్యాండ్ బాజా బరాత్` (2010)ని కాపీ చేసి తెలుగులో సినిమా తీసినందుకు నిర్మాత బెల్లంకొండ- నందిని రెడ్డి టీమ్ కు కోర్టు అక్షింతలు వేస్తూ తీర్పునివ్వడం సంచలనమైంది.
బెల్లంకొండ అలసత్యంతో చేసిన తప్పు ఇప్పుడిలా మెడపై కత్తిలా వేలాడుతోంది. 2013లో మొదలైన `జబర్ధస్త్` కాపీ క్యాట్ వివాదంపై తాజాగా దిల్లీ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం `బ్యాండ్ బాజా బరాత్`ని కాపీ చేసి తెరకెక్కించిన `జబర్ధస్త్` చిత్రాన్ని ఏ ఫార్మాట్ లోనూ ఎక్కడా రిలీజ్ చేయకూడదని సంచలన తీర్పును వెలువరించింది.
డీవీడీలు-వీసీడీలు-బ్లూరే ఫార్మాట్ సహా బుల్లితెరపైనా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి వీల్లేదని కోర్టు తీర్పు చెప్పింది. సిద్ధార్థ్- సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ అప్పట్లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ బ్లాక్ బస్టర్ బ్యాండ్ బాజా బారాత్
ని కాపీ కొట్టి తీశారన్న విమర్శలు వచ్చాయి. ఈ విషయం బాలీవుడ్ మేకర్స్ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థకు చేరడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో సినిమా రిలీజైన వారం నుంచే కాపీ క్యాట్ రచ్చ మొదలైంది. అప్పట్లో బెల్లంకొండ స్పందించకపోవడంతో దర్శకురాలు నందినిరెడ్డితో పాటు బెల్లంకొండపైనా యశ్ రాజ్ సంస్థ కాపీ రైట్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసింది. అటుపై కథ అడ్డం తిరిగింది.
2010లో రణ్‌వీర్‌సింగ్- అనుష్కశర్మ నాయకానాయికలుగా `బ్యాండ్ బాజా బారాత్` విడుదలై దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకోకుండానే బెల్లంకొండ సురేష్ దర్శకురాలు నందినిరెడ్డి చెప్పిన కథను గుడ్డిగా నమ్మి ఆ కాపీ కథతో `జబర్దస్త్ ` చిత్రాన్ని నిర్మించారు. తాజాగా సంపూర్ణ ఆధారాలతో యశ్ రాజ్ సంస్థ వినిపించిన వాదనను నిజమేనని అంగీకరిస్తూ దిల్లీ కోర్టు హిందీ చిత్రాన్ని కాపీ చేశారంటూ తెలుగు నిర్మాతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కాపీ నిరూపణ అయినందున నష్టపరిహారాన్ని సదరు సంస్థకు బెల్లంకొండ సురేష్ చెల్లించాలని తుది తీర్పును వెలువరించింది.