‘గొంతు కోసుకోవడం’పై గొంతు విప్పిన బండ్ల గణేష్‌

తెలంగాణ ఎన్నిక‌ల‌కు ముందు ఓ టీవీ ఛానెల్‌తో బండ్ల గ‌ణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా. గెల‌వ‌క‌పోతే డిసెంబ‌రు 11వ తేదీన‌ 7 ఓ క్లాక్ బ్లేడు తీసుకురండి నేనే గొంతు కోసుకుని చచ్చిపోతా అని బండ్ల గ‌ణేష్ కామెంట్ చేసారు. అయితే.., డిసెంబ‌రు 11న కాంగ్రెస్ ఓడిపోవ‌డం, ఆ మీడియా ప్ర‌తినిధి మ‌రీ అన్యాయంగా బ్లేడు తీసుకుని బండ్ల‌ను వెతుక్కుంటూ వెళ్ల‌డం చకచకా జ‌రిగిపోయాయి.

అయితే అటు మీడియాకు, ఇటు బండ్ల గణేష్ కు ఇద్దరికీ పబ్లిసిటీ కావాలి కాబట్టి బ్లేడ్ ని అడ్డం పెట్టి ఇద్దరూ గేమ్ ఆడారు. కొద్ది రోజులుగా బండ్ల గణేష్ మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చిన ఆయన దర్శనానంతరం మీడియాతో మాట్లాడక తప్పలేదు. ఆ టైమ్ లో బ్లేడ్ టాపిక్ రాకుండా ఎలా ఉంటుంది. ఓ మీడియా విలేఖరి ఆవేశంగా గణేష్ ని ఆ విషయమై నిలదీసాడు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ..‘అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను అజ్ఞాతంలో లేను. మా పార్టీ గెలుస్తుందని ఎన్నో ఊహించుకున్నాం. కానీ ప్రజలు మా పార్టీని తిరస్కరించారు. టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మౌనంగా ఉండాల్సి వచ్చింది.

అరే కోపంలో వంద అంటాం సార్‌.! అవన్నీ నిజం అవుతాయా! మీరు కోసుకోమంటే కోసుకుంటా. చాలా అంటాం ఇవన్నీ మాములే. ఉరికే మావాళ్ల ఉత్సాహం కోసం అలా మాట్లాడాను. ఇప్పుడేం చేయమంటారు. కాన్ఫిడెన్స్‌ కాస్త ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అయ్యింది దానికి ఏం చెబుతాం.’ అని గొంతు కోసుకోవడంపై తనదైన శైలిలో స్పందించారు.