బాల‌య్య‌తో పూరీ.. ఏంటి సంగ‌తి?

బాల‌య్య గుండెను వీణ‌లా మీటాడ‌ట‌!

ఒకే ఒక్క హిట్టు అన్నిర‌కాలుగా కిక్కిస్తుంది. స‌క్సెస్ కి ఉన్న మ‌హ‌త్తు అది. ప్ర‌స్తుతం ఆ మ‌హ‌త్తు పూరిపై చాలానే ప్ర‌భావం చూపిస్తోంద‌ట‌. ఇన్నాళ్లు ఫ్లాప్ డైరెక్ట‌ర్ అంటూ ప‌క్క‌న పెట్టిన వాళ్లే తిరిగి ప‌ల‌క‌రిస్తున్నారు. త‌న‌ని కావాల‌ని దూరం పెట్టిన వాళ్లంతా పిలిచి మ‌రీ ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకుంటున్నార‌ట‌. క‌థ చెబుతాను అంటే వినేందుకు టైమ్ కేటాయిస్తున్నారు. అయితే ఇంత ఛాన్స్ ఇస్తే పూరి ఊరుకుంటాడా?అస‌లే ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సెస్ తో మాంచి ఊపుమీదున్నాడు మ‌నోడు. వ‌రుస‌గా యువ‌హీరోల్ని.. స్టార్ హీరోల్ని ట‌చ్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమాని ఖాయం చేసిన ఊపులో ఉన్నాడు. అలాగే రౌడీతో సినిమా సెట్స్ కి వెళ్ల‌క‌ముందే వేరొక స్టార్ హీరోతో సినిమాని లైన్ లో పెట్టేయ‌బోతున్నాడ‌ట‌. మెగాస్టార్ చిరంజీవి.. బాల‌కృష్ణ .. ర‌వితేజ అంటూ వ‌రుస‌గా కొన్ని పేర్లు వినిపించాయి. అయితే వీళ్లంద‌రిలో తొలిగా న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ప్రాజెక్ట్ ఖాయ‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. బాల‌య్య వైపు నుంచి పూరికి ఆ మేర‌కు పాజిటివ్ సంకేతాలు క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి బాల‌య్య‌- పూరి సినిమా గురించి ఇదివ‌ర‌కూ వార్త‌లు వ‌చ్చినా అది అప్ప‌ట్లో పెండింగ్ లో ప‌డింది. తిరిగి అదే ప్రాజెక్టును ఖాయం చేస్తున్నారా? అన్న‌ది చూడాలి. ఇక బాల‌య్య‌తో పూరి మార్క్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ ఇద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎవ‌రు నిర్మిస్తారు? అన్న‌ది తెలియాల్సి ఉంది. మ‌రోవైపు బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా కె.ఎస్.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే.