ఐశ్వర్య రాయ్-ఆరాధ్య బచ్చన్ కోలుకున్నారా?
బచ్చన్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ అన్న వార్తలు కల్లోలం రేపిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సెలబ్రిటీల్ని కరోనా కబలిస్తోంది. చాలామంది కోలుకున్నా కొందరు మరణించడం అభిమానుల్ని కలచివేసింది. ఆ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ కి 77 వయసులో కరోనా అంటుకోవడం కలతకు గురి చేసింది. ఆయనకు ఆయన వారసుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో గుడులు గోపురాలకు వెళ్లి మరీ అభిమానులు పూజలు చేశారు. చాలా మంది అభిమానులు ఇండ్లలో హోమాలు చేయిస్తున్న ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
ఇక బిగ్ బి- స్మాల్ బిలకు మాత్రమే కరోనా పాజిటివ్ అనుకుంటే ఆ వెంటనే అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్ కి మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ అన్న రిపోర్ట్ రావడం కలకలం రేపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐష్ అభిమానులు ఒక్కసారిగా తొట్రు పడ్డారు. అసలేం జరుగుతోంది? బచ్చన్ ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని బాధపడని అభిమాని లేడు. అయితే మహమ్మారీని జయించి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తామని ముంబై నానావతి ఆస్పత్రి నుంచి అమితాబ్ జీ ఎంతో ధైర్యంగా పోరాట యోధుడిలా ప్రకటించిన తీరు అభిమానులకు ఊరటనిచ్చింది. దేశంలో కరోనా నుంచి కోలుకుని ఎందరో తిరిగి యథావిధి స్థితికి చేరుకున్నారు. అందుకే ఇప్పుడు అదే హోప్ తో ఉన్నారంతా.
తాజా సమాచారం ప్రకారం.. అమితాబ్ – అభిషేక్ ముంబై నానావతి ఆస్పత్రిలోనే ఐసోలేషన్ లో ఉన్నారు. నేడు ఐశ్వర్యారాయ్ .. ఆరాధ్యను కూడా అక్కడికే చేర్చారని తెలుస్తోంది. కరోనా పాజిటివ్ అని తేలినప్పుడు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే. ఒకట్రెండు రోజులు ఇంట్లోనే హోం క్వారంటైన్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఐశ్వర్యారాయ్ కి అధిక జ్వరం వచ్చిందని గొంతు నొప్పి అధికంగా ఉందని.. ఆరాధ్యకు స్వల్పంగా జ్వరం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఇద్దరికీ చికిత్స సాగుతోంది. ఈ రెండ్రోజుల రిపోర్ట్ ప్రకారం.. ఐష్.. ఆరాధ్య కోలుకున్నారట. వారికి జ్వరం తగ్గింది. ఐష్ కి గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభించింది. ఏడు రోజుల తర్వాత మరోసారి కరోనా టెస్టులు చేయాల్సి ఉండగా.. నేడో రేపో ఆ టెస్టులు కూడా జరగనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం బచ్చన్ ఫ్యామిలీ లో కరోనా సోకిన ఆ నలుగురు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇక ఆ ఇంట్లో పరీక్షలు జరిపిన వారిలో జయా బచ్చన్.. నవ్య నందా తదితరులకు నెగెటివ్ అని తేలిన సంగతి విధితమే.