(ధ్యాన్)
“ఆర్టిస్టుగా ఒకసారి మేకప్ వేసుకున్నాక తప్పకుండా మళ్లీ ఏదో ఒక సినిమా చేయాల్సిందే. ఏదో ఒక పాత్రను పోషించాల్సిందే. హీరోగానే చేస్తానంటే కుదరదు. ఈ మధ్య మా అన్నయ్య రాజేష్‌కి కూడా ఈ విషయాన్నే చెప్పాను. `హీరోగా ఫ్లాప్‌లు పడుతున్నాయి.. వర్కవుట్ కావడం లేదు.. ఇంకేం చేస్తావు` అని అడిగా. తను మూవ్ అయి ఇప్పుడు మంచి కేరక్టర్లు చేస్తున్నాడు“ అని అన్నాడు నరేష్. ప్రస్తుతం నరేష్ హీరోగా, ఆయన ఫ్రెండ్ సునీల్ ఓ కీలక పాత్ర పోషిస్తూ తెరకెక్కిన సినిమా `సిల్లీ ఫెలోస్`. ఈ సందర్భంగా నరేష్ మీడియాతో చిట్‌చాట్.
* సిల్లీ ఫెలోస్ రిలీజవుతోంటే.. టెన్షన్‌గా ఉందా?
– చాలా ఉంది. లేదంటే అబద్ధమే అవుతుంది. ఇన్నాళ్లూ ఇండస్ట్రీలో ఉన్నా ఇంకా ఫ్రైడే ఫీవర్ పోవడం లేదు.
* హీరోగా ఫ్లాపుల్లో ఉన్నామనేనా సైడ్ కేరక్టర్లు చేస్తున్నారు?
– ఇంతకు ముందు కూడా చేశానుగా. ఆ మాటకొస్తే నేను హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను రఘువరన్‌కి ఫ్యాన్‌ని. విలన్ అవుదామని ముగ్గురి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నా. ఆ సమయంలో ఒక్క స్కిట్ కూడా కామెడీ చేయలేదు. కానీ రవిబాబు నాతో కామెడీ చేయించేశాడు.
* మీరు దర్శకత్వం కూడా చేయాలనుకున్నారుగా?
– అవును. నా కథలు కామెడీగా ఉండవు. అన్నీ క్రైమ్గానే ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని చంపుదామా అన్న తరహాలో సాగుతాయి. విజన్ 2020 అని పేరు పెట్టుకుని స్క్రిప్ట్ చేస్తున్నా. త్వరలోనే మిగిలిన పనులు కూడా మొదలుపెడతా.
* మీ ఈవీవీ బ్యానర్‌లోనే ఉంటుందా?
– లేదండీ. కొత్త పేరు పెడతాను. కొత్త బ్యానర్‌లో నేను సినిమాను డైరక్టర్‌గా, నిర్మాతగా చేస్తా.
* మీరే నటిస్తారా?
– అందరూ కొత్తవారితో చేస్తాను. నేను ఒక్క ఫ్రేమ్‌లో కూడా ఉండను.
* మీ అన్నయ్య, మీరూ ఇద్దరూ బిజీగా ఉన్నట్టున్నారు?
– ఆర్టిస్టులుగా మమ్మల్ని బిజీగా చూడాలన్నది మా పేరెంట్స్ కోరిక. ఇప్పుడు నిద్రలేవగానే ఇద్దరం చెరో కారులో వెళ్లిపోతుంటే మా అమ్మ `హమ్మయ్య ఇద్దరూ పనికెళ్లారు` అని అనుకుని సంబరపడిపోతోంది. సో మేం కూడా హ్యాపీ.
* మహేష్‌తో చేస్తున్న సినిమా గురించి?
– ఇప్పుడే ఏం చెప్పొద్దన్నారు. కాకపోతే మహేష్ సో స్వీట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. చాలా మంచి మనిషి. మరో గాలిశీను తరహా పాత్ర అవుతుందనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమా విడుదలయ్యాక చాలా మంది నన్ను మనసులో ఉంచుకుని ఈ తరహా పాత్రలు రాసుకుంటారు. మా అమ్మాయి పుట్టాక నేను సంతకం చేసిన తొలి సినిమా `మహర్షి`.