జాతకాన్ని నమ్మిన అక్కినేని .. ఏమైందో తెలుసా ?

మానవుడు ఆశాజీవి . రూపులేని రేపు మీద మమకారం ఎక్కువ. అదే ఆశ , శ్వాసగా బతుకుతుంటాడు . ఇందుకు ఎవరు మినహాయింపు కాదంటే అతిశయోక్తి ఉండదేమో ? ఇక చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటారు . తమ భవిష్యత్తు బంగారంలా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు . కళాకారులు రేపు అనే ఉజ్వలమైన భవిష్యత్తు కోరుకుంటారు . తారాపధంలో వున్నవారు కూడా తరువాత ఏమిటి అనే కోరిక ఉండటం సహజం .

తెలుగు సినిమా ప్రపంచంలో వెలుగు ప్రస్థానం ఎవరిదీ అంటే అక్కినేని , రామారావు అని వెంటనే చెప్పేస్తారు . ఆ ఇద్దరు సినిమాకు వెలుగు రేకలు , వేగు చుక్కలు .అక్కినేని చిన్న కుటుంబం నుంచి, పెద్దగా చదువుకోకుండా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు . మొదట్లో అక్కినేని చాలా ఒదిగి ఉండేవాడు . తనకి ఏమి తెలియదు అనే బిడియం ,భయం ఎప్పుడు వెంటాడుతూ ఉండేవి . అందుకే పట్టుదలతో శ్రమించేవాడు . అక్కినేని నాగేశ్వర రావు నాస్తికుడు దేనిని నమ్మడు అంటారు. చాలా సందర్భాలలో అక్కినేని స్వయంగా చెప్పాడు . ఆయనకు వాస్తు పట్టింపు లేదు , జాతకాలు అసలే నమ్మడు అనే అభిప్రాయం వుంది . అయితే ఇది నిజం కాదు . ఆ రెండింటినీ అక్కినేని నమ్ముతాడు .

హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఆయన బేగంపేటలో కుటుంబంతో ఉండేవాడు .ఆ తరువాత బంజారా హిల్స్ లో తన అభిరుచికి తగ్గట్టు ఇల్లు నిర్మించుకున్నాడు . అయితే అది వాస్తుప్రకారం లేదని పండితులు చెప్పారు . అయినా కొంత కాలం గడిచిన తరువాత ఆయన అన్నపూర్ణ స్టూడియోలో పనిచేసే కర్ణా చారి అనే కార్పెంటర్ను పిలిచి వాస్తు చూడమన్నాడు . హైదరాబాద్ సినిమా రంగంలో కర్ణాచారి వాస్తు పండితుడని అందరికీ తెలుసు . ఇల్లు వాస్తు ప్రకారం లేదు అని చెప్పాడు . అయితే వాస్తు ప్రకారం మార్పులు చెయ్యమన్నాడు . చేసినా కర్ణా చారి పెదవి విరిచాడు . అప్పుడు ఆ ఇల్లు డెవలప్ మెంట్ కు ఇచ్చి జూబిలీహిల్స్ లో వాస్తు ప్రకారం కట్టించుకున్నాడు . ఆఖరికి గండిపేట దగ్గర వున్న ఫామ్ హౌస్ లో కూడా కర్ణాచారి చూచనల ప్రకారం చిన్న ఇల్లు కట్టించాడు . వీటి గురించి ఎవరైనా సన్నిహిత మిత్రులు అడిగితే”ఆబ్బె మనకు నమ్మకాలు లేవు . అన్నపూర్ణ చేయించుకుంది “అని చెప్పేవాడు

ఇక జాతకాలు అంటే అక్కినేని బాగా నమ్ముతాడు . మొదట్లో ఆయనకు కెమెరామన్ రామకృష్ణా రావు జాతకం వ్రాశాడు . అది ఎప్పుడూ అక్కినేని పర్చు లో పెట్టుకునేవాడు . హైదరాబాద్ జూబిలీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో నివాసం వుండే వీవీ రావు అనే జ్యోతిస్కుడు ను అక్కినేని బాగా నమ్మేవాడు . అప్పుడప్పుడు అక్కినేని వీవీ రావు దాగరకు వచ్చి కూర్చునేవాడు .

వీరిలో ఎవరు చెప్పారో తెలియదు కానీ అక్కినేని జాతక రీత్యా 2002 సంవత్సరం దాటడు అని చెప్పారు . తరువాత తాను బ్రతకనని అర్ధమైంది . అందుకనే ఒక కారు కొనుక్కొని దానికి 2002 అనే నెంబర్ వేయించాడు . విచిత్రం ఏమంటే ఆయన 22 జనవరి 2014 వరకు బ్రతికాడు .
కాబట్టి జాతకాల మీద నమ్మకం ఎలా ఉంటుందో ఈ ఘటన తెలియజేస్తుంది .


నమ్మకాలకు అక్కినేని అతీతుడు కాదు . నమ్మకం వేరు వాస్తవం వేరు … కాదంటారా ?