సినిమా స్టార్స్ డబ్బులు కోసం తమ క్రేజ్ ని పెట్టుబడిగా పెట్టి రకరకాల ప్రొడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తూంటారు. దాంతో ఆ హీరో అభిమానులంతా వాటిని వాడుతూంటారు. అయితే రెగ్యులర్ గా ఆరోగ్యానికి హానిచేయని వాటివలన పెద్ద గా సమస్య ఏమీ ఉండదు. కానీ పొగాకు ఉత్పత్తలును భాధ్యతలేకుండా ప్రమోట్ చేస్తే…ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే ఆ హారోదే భాధ్యత అవుతుందా. ఇప్పుడు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ అలాంటి విమర్శనే ఎదుర్కొంటున్నారు. ఆయన కారణంగా ఓ వ్యక్తి క్యాన్సర్ బారినపడ్డాడట.
వివరాల్లోకి వెళితే….అజయ్ గతంలో పలు టొబాకో ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించేవారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన నానక్‌రామ్ అనే 40 ఏళ్ల అభిమాని.. అజయ్ ప్రచారకర్తగా వ్యవహరించే టొబాకో ఉత్పత్తులనే వాడారట. దాంతో కొంతకాలానికి అతనికి క్యాన్సర్ వచ్చింది. ఈ మేరకు టొబాకో ఉత్పత్తులకు సెలబ్రిటీలు ప్రచారం కల్పించకూడదంటూ నానక్‌రామ్ విన్నవించుకుంటున్నారు.
‘అజయ్ ఓ టొబాకో ప్రకటనలో నటించడం చూసి మా నాన్న కూడా అదే ఉత్పత్తిని వాడారు. మా నాన్న అజయ్ దేవగణ్‌కు వీరాభిమాని. కానీ ఆ ఉత్పత్తులను వాడటం వల్ల నాన్నకు క్యాన్సర్ వచ్చింది. అప్పటినుంచి అజయ్ లాంటి స్టార్ సెలబ్రిటీలు ఇటువంటి ఉత్పత్తులకు ప్రచారం కల్పించకూడదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాటలను ఓ కాగితంపై రాసి దాదాపు వెయ్యి కరపత్రాలను ప్రచురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని ప్రాంతాల్లో అంటించాం’ అని నానక్‌రామ్ కుమారుడు దినేశ్ మీడియా ద్వారా వెల్లడించారు.
నానక్‌రామ్‌కు ఇద్దరు పిల్లలు. జైపూర్‌లోని సంగనేర్ పట్టణంలో పాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇప్పుడు అతను వ్యాధి బారిన పడటంతో కుటుంబ బాధ్యత కుమారుడిపై పడింది. అయితే ఈ అంశంపై అజయ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.