అడవి శేషు “ఎవరు” ఆ సినిమాకు కాపీనా?

కాపీ కొట్టడం, రీమేక్ చేయటం ఈ రెండు  ఒకేలా అనిపించినా.. వేర్వేరు వ్యవహారాలు. అయితే ఒకటి లీగల్..మరొకటి ఇల్లీగల్.   సినిమావాళ్ళు గతంలో ఏదో ఒక సినిమా నుంచి పాయింట్ లేపేసి తమ సొంత తెలివితో కథ అల్లేసేవారు. అయితే అప్పట్లో ఒక చోట రిలీజైన సినిమా గురించి మరో చోట తెలియాలంటే చాలా కాలం పట్టేది. కానీ రోజులు మారిపోయాయి. ఇప్పుడు తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. దాంతో అందరి దృష్టీ వీటిపై పడుతోంది. ఎక్కడైనా కాపీ ఉంటే దొరికిపోతున్నారు. అందుకే అఫీషియల్ గా రీమేక్ రైట్స్ కొని రిస్క్ తగ్గించుకుంటున్నారు మేకర్స్. ఇప్పుడు అడవి శేషు కూడా తన తాజా చిత్రం ఎవరు కోసం అలాంటి ప్రయత్నం ఏమన్నా చేసాడా అనేది హాట్ టాపిక్ గా మారింది.

క్షణం, గూఢచారి వంటి విభిన్న చిత్రాలలో నటించి మంచి విజయాలు అందుకున్నారు హీరో అడవి శేషు. తాజాగా శేషు..“ఎవరు” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఈ మూవీకి పెట్టారు. వెంకట్ రాంజీ దర్శకత్వంలో సస్పెన్సు థ్రిల్లర్ గా ఈమూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాని స్పానిష్ చిత్రం “The Invisible Guest” ఆధారంగా రూపొందుతోందని సమాచారం. ఇదే సినిమా రైట్స్ తీసుకుని కొద్దిగా మార్చి తాప్సీతో బదలా చిత్రం చేసారు. ఆ సినిమా హిట్ అయ్యింది. దాంతో తెలుగులో అడవి శేషు ఈ సినిమాని చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే రైట్స్ కొని చేసారా లేక లేపేసారా అనే విషయం తెలియరాలేదు.

ఇక సినిమాపై ఆసక్తిని పెంచడానికి ఈ సినిమా షూటింగ్ రహస్యంగా మీడియా కి సమాచారం లేకుండా పూర్తి చేసారంట. అడవి శేషుకి సరసన హీరోయిన్ గా రెజీనా కాసాండ్రా చేస్తున్న ఈ మూవీలో నవీన్, మురళి శర్మ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కారక్యమాలు పూర్తిచేసి ఆగస్టు 23న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.