ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు కన్నుమూసారు. ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మంగళవారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు సినిమా రంగంలో కొండలరావు ప్రస్థానం ఎంతో గొప్పది. దాదాపు 600 కు పైగా చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలకు దర్శక, నిర్మాతగాను వ్యవహరించారు. అలాగే బుల్లి తెరపైనే ఆయన మార్క్ వేసారు. ఎన్నో సీరియళ్లలో నటించారు. అక్కడా పలు సీరియళ్లకు దర్శకత్వం వహించారు. 1958 లో `శోభ` అనే సినిమాతో కొండలరావు సినీ ప్రస్థానం మొదలైంది.
ఆ తర్వాత దసరా బుల్లోడు, తేనె మనసులు, రంగూన్ రౌడీ, వరకట్నం, భైరవద్వీపం, బృందావనం ఇలా గొప్ప చిత్రాలున్నాయి. మొత్తంగా 600 సినిమాలకు పైగా చేసారు. ఇక ఆయన భార్య రాధ కూడా నటే. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. రావి కొండలరావుది తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట. ఫిబ్రవరి 11, 1932 లో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో మద్రాస్ ప్రయాణం అయ్యారు. కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆనందవాణి అనే పత్రికలో సంపాదకుడిగా పనిచేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారు. బాపు-రమణలు కొండలరావుకి ఆప్తులు. వాళ్లిద్దరితో కలిసి కొండలరావు రచయితగాను పలు సినిమాలకు పనిచేసారు. తమిళ్, మలయాళ సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పేవారు.
ఇటీవల లాక్ డౌన్ కారణంగా రావుకొండలరావు కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు 50 వేల రూపాయాలు సహాయం చేసారు. ఇంకా ఆయన గురించి తెలిసిన పలువురు సెలబ్రిటీలు సహాయం అందించారు. తాజాగా కొండలరావు మృతిపట్ల టాలీవుడ్ సంతాపం ప్రకటించింది. పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు, `మా` అసోసియేషన్ సంతాపం తెలిపింది. టాలీవుడ్ లో ఆయన సేవలు చిరస్మరణీయం అని..అలాంటి నటులు మళ్లీ పుట్టరని దిగ్ర్భాంతి వ్యక్తం చేసారు.