ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మృతి కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కన్నా కోడలు నల్లపురెడ్డి సుహారిక మే 28న గచ్చిబౌలిలో అనుమానదాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. సంఘటన జరిగి దాదాపు రెండు నెలలు గడుస్తున్న సమయంలో సుహారిక భర్త ఫణీంద్ర శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ను కలిసి తన భార్య మృతిపై అనేక అనుమానాలున్నాయని పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని ఫిర్యాదు పత్రం అందజేసారు. తొలుత సుహారిక తొలుత గండిపేటలోని చైతన్య భారతీ ఇంజనీరింగ్ కళాశాలలో చనిపోయిందని చెప్పారని, ఆ తర్వాత ఆ మాట మార్చి గచ్చిబౌలిలోని బ్యాంబో హిల్స్ విల్లాలో ఉంటున్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లగా అక్కడ కుప్ప కూలిపోవడంతో సమీపంలో ఉన్న ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించినట్లు చెప్పారన్నారు.
ఇలా పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేయడంతో సుహారిక మృతికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ ని ఫణీంద్ర తెలిపారు. సుహారిక మారథాన్ రన్నర్ అని , ఆమెకు ఎలాంటి దురలవాట్లు లేవని అన్నారు. అయితే తన తోడల్లుడితో తనకు ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని వీటితో సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆర్ధిక సమస్యల అంశాన్ని చర్చించేందుకే మే 28వ తేదీన సుహారికను గచ్చిబౌలి విల్లాకు పిలిపించారన్నారు. ఈ విషయంలో ఏం జరిగిందని తాను తన అత్త మామలను, సుహారిక కుటుంబ సభ్యులను అడిగితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించారని చెప్పారన్నారు.
సుహారిక చనిపోయిన రోజు విల్లాలో తన తోడల్లుడితో కలిసి మరో నలుగురు విందు చేసుకున్నారని, వీరందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో కొత్త ట్విస్ట్ మొదలైంది. పోలీసులు ఇప్పుడు సుహారిక మృతిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది. సుహారికది అనుమానదాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుహారిక భర్త భార్య మృతిపై అనుమానం వ్యక్తం చేయడం… ఆమె మృతి తర్వాత సుహారిక కుటంబ సభ్యులు పార్టీ చేసుకోవడం వంటి సన్నివేశాలపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాల్సి ఉంది.