టాలీవుడ్‌లో టాప్ కమేడియన్లలో ఒకరిగా కొనసాగుతున్న నటుడు పృథ్వీ. `30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ..` అనే ఒకే ఒక్క డైలాగ్‌తో ఏ రేంజ్‌లో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారో తెలుసు. సినిమాలో కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉండే ఒక్క సీన్‌తో `30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ`గా పేరు తెచ్చుకున్నారు. ఏకంగా తన డైలాగ్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్న అరుదైన నటుడు ఆయన.
రాజకీయాలపై ఆయనకు ఆసక్తి ఉంది. అందుకే- ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానిగా మారిపోయారు. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలోనూ పాల్గొన్నారు. జగన్‌కు మద్దతు పలికారు. తాజాగా ఆయన పొలిటికల్ యాక్షన్‌లోకి దిగిపోయారు.
దేశ రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొంటూ తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, అనుకూల మీడియాకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి నిర్మిస్తోన్న షార్ట్‌ఫిల్మ్‌లకు ఆయన యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.
సైరా క్రియేషన్స్ బ్యానర్‌పై విజయసాయి రెడ్డి ఈ షార్ట్‌ఫిల్మ్‌లను రూపొందిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానబలమైన సోషల్ మీడియా వేదికగా వాటిని ప్రసారం చేస్తారు. `బాబూ! నీకిది తెలుసా?` అనే టైటిల్ కామన్‌గా కనిపిస్తుంది.
చంద్రబాబు అనుకూల మీడియా చెప్పని, ప్రచురించని, వాస్తవాలను ఈ షార్ట్‌ఫిల్మ్ ద్వారా వెలుగులోకి తీసుకుని వస్తామని విజయసాయి రెడ్డి చెబుతున్నారు. 57 సెకెన్ల పాటు ఉండే ఓ వీడియోను విజయసాయి రెడ్డి శుక్రవారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌లకు ఈ వీడియో ఓ ట్రైలర్‌గా చెప్పుకోవచ్చు.
బాబూ… నీకిది తెలుసా?#BabuNeekidiTelusa #babuneekiditelusa pic.twitter.com/9sd4vWdv3I
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 25, 2019