తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ముందుగా రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించాడు. ఆయన తర్వాత విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు ప్రకటించారు. అక్కడి నుంచి సినీ ప్రముఖులంతా వరుసగా ఆర్థికసాయం చేయడమే కాకుండా సిక్కోలుకు అండగా
నిలబడాలని పిలుపునిస్తున్నారు.
తాజాగా ఆ లిస్ట్ లోకి ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ, నటి శ్రీరెడ్డి కూడా చేరారు.తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం కార్తికేయ రూ.2 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే నటుడు, దర్శకుడు,కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ కొత్త సినిమాకు నటి శ్రీరెడ్డి సైన్ చేశారు. ఈ సినిమాలో తను కీలక పాత్ర పోషించనున్నట్లు ఆమె సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. సినిమాకు ఇచ్చిన అడ్వాన్స్‌ను శ్రీకాకుళం తుపాను బాధితులకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు.
‘నా స్నేహితులకు శుభవార్త. లారెన్స్ గారిని ఆయన ఇంట్లో కలిశా. చాలా బాగా ఆహ్వానం పలికారు. అక్కడ చాలా మంది చిన్నారులు ఉన్నారు. వాళ్లు లారెన్స్‌తో చాలా సంతోషంగా ఉండటం గమనించా. నేను ఆడిషన్స్ ఇచ్చాను. లారెన్స్ తన తర్వాతి సినిమా కోసం నన్ను తీసుకున్నారు. కచ్చితంగా మంచి పాత్ర ఇస్తానని ప్రామిస్ చేశారు, అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీన్ని శ్రీకాకుళం తుపాను బాధితులకు విరాళంగా ఇస్తాను’ అని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
ఇక హీరో నిఖిల్ మరో ముందడుగు వేసి…. స్వయంగా బాధిత ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజానీకాన్ని పరామర్శించడమే కాదు, 3 వేల మందికి భోజన సదుపాయం కల్పించాడు. అలాగే 2500 కేజీల బియ్యం, 500 దుప్పట్లు, విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్న వారికోసం పోర్టబుల్ జనరేటర్లు పంపిణీ చేశాడు. అలాగే అక్కడి ప్రజలతో కలిసి భోజనం చేశాడు. అది తనకు చాలా ఆనందాన్నిచ్చిందని నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.