టాలీవుడ్ భ‌విష్య‌త్‌పై ఆ న‌లుగురిలో ఆందోళ‌న‌

ఊహించిందే జ‌రిగేలా ఉంది. క‌రోనా క‌ల్లోలంలో అన్ని రంగాలు కుదేల‌వ్వ‌డం ఒక ఎత్త‌యితే.. సినీ రంగం అత‌లాకుత‌లం అవ్వ‌డం మ‌రో ర‌క‌మైన ఎత్తు. ఇత‌ర రంగాల్లో మెజారిటీ పార్ట్ రేపో.. మాపో కుదురు కుంటాయి. ఫ్యాక్ట‌రీలు తెరుచుకుంటాయి. పాత ప‌రిస్థితుల్లోకి రావ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్టక‌పోవ‌చ్చు. కానీ సినీప‌రిశ్ర‌మ‌ల్లో సీన్ వేరేగా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ప‌రిస్థితులు వాటికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇప్ప‌టికే అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు ఈ విష‌యంపై ప‌బ్లిక్ గానే హెచ్చ‌రించారు. ఆయ‌న హెచ్చ‌రించిన‌ట్టే జ‌గ‌ర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. తాజాగా సురేష్ బాబు వ్యాఖ్య‌ల్ని బ‌ల‌ప‌రుస్తూ మెగా నిర్మాత అల్లు అర‌వింద్…దిల్ రాజు ఇండస్ట్రీ భ‌విష్య‌త్ పై పెద‌వి విరిచేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆశావాహ ధృక్ప‌థంతో ఉన్నామ‌ని బింకాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నా.. లోలోన ఆందోళ‌న బ‌య‌ట‌ప‌డుతోంది వారి మాట‌ల్లో.

2020 గాయ‌బ్ అయిపోయింది. 2021 ప‌రిస్థితి అయినా బావుంటుందా? అంటే .. డిసెంబ‌ర్..జ‌న‌వ‌రి నాటికి థియేట‌ర్లు ఓపెన్ చేస్తే ఫ‌ర్వాలేదు.. కానీ ఆ సీనే క‌నిపించ‌లేదు. క‌రోనాకి వెంట‌నే మందు వ‌చ్చినా జ‌నం ధైర్యం చేసి గుంపులు గా థియేట‌ర్ల‌కు రావ‌డానికి ఆ తర్వాత కూడా మ‌రో ఆరు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది. థియేట‌ర్లో కి వెళ్తే క‌రోనా అంటుకుంటుంది! అన్న భ‌యం జ‌నాల్లో బలంగా నాటుకుపోయింది. పైగా ఏసీ థియేట‌ర్లు….కిక్కిరిసిపోయే ప‌రిస్థితి కూడా ఉంటుంది కాబ్ట‌టి జ‌నాలు భ‌య‌ప‌డ‌టంలో త‌ప్పు లేదు. ఇక లాక్ డౌన్ స‌డ‌లించినా.. అన్నింటికంటే చివ‌రిగా తెరుచుకునేవి కూడా థియేట‌ర్లే. ఇది చిన్న సినిమాల‌కి మ‌రింత ఇబ్బందిక‌ర‌మ‌‌నే చెప్పాలి. ఇక ఓటీటీల్లో రిలీజ్ చేయాల‌నుకున్నా.. సినిమా నిర్మాణానికి అయిన వ్య‌యం మొత్తం ఓటీటీలు చెల్లించ‌లేవు. బడ్జెట్ నిబ‌తిరిగి రాబ‌ట్టుకోవ‌డం కోసం చూస్తే సినిమాని వ‌డ్డీలు తీనేస్తాయి. వ‌డ్డీల్ని త‌ట్టుకోగ‌లిగితేనే ప్రాజెక్ట్ సేఫ్ లో ఉన్న‌ట్లు. ఓటీటీ వ‌ల్ల భ‌విష్య‌త్ లో ఆడియ‌న్ థియేట‌ర్ కు రావ‌డం క‌ష్ట‌మే. ప్ర‌స్తుతానికైతే ప‌రిశ్ర‌మ తీవ్ర సంక్షో‌భంలో ఉంద‌ని అల్లు అర‌వింద్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిస్థితి నుంచి స‌ర్థుకునేందుకు ఇంకో రెండేళ్లు ప‌ట్టొచ్చ‌న్న విశ్లేష‌ణా చేశారాయ‌న‌.

మే అనంత‌రం లాక్ డౌన్ ఎత్తేస్తే కానీ ఏదీ చెప్ప‌లేం. అయితే చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయిన సినిమా ఆరు నెల‌లలోపు రిలీజ్ చేయాలి. లేదంటే సినిమాలో క్వాలీటీ పోతుంది. బాగా పాత‌బ‌డిపోయిన‌ట్లు అయిపోతుంది. ఆరు నెల‌లోపు థియేట‌ర్లు తెరుచుకోక‌పోతే చాలా పెద్ద స‌మ‌స్యే ఉత్ప‌న్నం అవుతుంది. అందుకు చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా ఏమీ ఉండ‌ద‌ని దిల్ రాజు అన్నారు. వీళ్లిద్ద‌రి వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి ప‌రిశ్ర‌మ భ‌విష్య‌త్ ఏంటో స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఇవ‌న్నీ ఆలోచించే సెల‌బ్రిటీలంతా ప‌రిశ్ర‌మ‌ను కాపాడుకోవ‌డం కోస‌మే భారీ ఎత్తున విరాళాలు ఇవ్వ‌డం..ఎన్న‌డూ లేనంత‌గా సేవ‌లు చేయ‌డం వంటివి చేస్తున్నారన్న విశ్లేష‌ణా తాజాగా తెర‌పైకి రావ‌డం విశేషం. డి.సురేష్ బాబు- అల్లు అర‌వింద్- దిల్ రాజు .. ఇలా యాక్టివ్ నిర్మాత‌లు.. ఆ న‌లుగురిలో కీల‌క‌మైన వాళ్లంతా బ‌య‌ట‌ప‌డ్డారు. మ‌రి మునుముందు బ‌య‌ట‌ప‌డేవారు ఇంకెంద‌రు? అన్న‌ది ఊహిస్తేనే ఆందోళ‌న‌ను రేకెత్తిస్తోంది.