ఇంతలోనే బయోపిక్ ప్రకటనా?
బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఇది హత్యనా ఆత్మహత్యనా? అంటూ అభిమానులు సహా కుటుంబ సభ్యులు రకరకాల సందేహాలు వ్యక్తం చేయగా పోస్ట్ మార్టమ్ లో ఆత్మహత్యనే అని నిర్ధారణ అయ్యింది. పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే అతడి మరణం వెనక రకరకాల కోణాలపై బాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
సుశాంత్ సింగ్ పై రకరకాల కుట్రలు సాగాయి. అతడు గొప్ప సక్సెస్ తో దూసుకెళుతున్నా.. అడ్డుకునేందుకు కొన్ని తెరవెనక శక్తులు రకరకాలుగా ప్రయత్నించాయన్న ఆరోపణలు సోషల్ మీడియాల్లో వెల్లువెత్తాయి. పలువురు ప్రముఖ సెలబ్రిటీలే నేరుగా సోషల్ మీడియాల్లో ఆరోపించడంతో అవి కాస్తా వివాదాస్పదం అయ్యాయి. ఎన్నడూ లేనంతగా బాలీవుడ్ లో నెప్టోయిజం.. ఇంటర్నల్ మాఫియా అంశాలు చర్చకువ చ్చాయి. ఖాన్ గిరీపైనా.. కపూర్ల దందాపైనా కూడా చర్చ సాగింది. అంతేకాదు.. కరణ్ జోహార్ కేవలం సెలబ్రిటీ వారసులకు మాత్రమే అవకాశాలిస్తాడని తిట్టి పోసారు.
ఆలియాభట్ సహా ఖాన్ డాటర్స్ పైనా.. ఏక్త వంటి వారిపైనా తిట్లు చీవాట్లు అగ్గి రాజేశాయి. అలాగే ఎందరికో స్టార్ వారసులకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసిన సల్మాన్ ఖాన్ పైనా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అతడు పలువురిపై కుట్రలు చేసి తొక్కేశాడన్న ఘాటైన ఆరోపణలు రావడం వేడెక్కించింది. యశ్ రాజ్ ఫిలింస్ సహా ఆరు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు సుశాంత్ సింగ్ ని ఎదగనీకుండా కుట్రకు పాల్పడ్డాయన్న ఆరోపణలు వినిపించాయి. నటవారసుడిగా కాకుండా స్వశక్తి ప్రతిభతో ఎదిగిన సుశాంత్ సింగ్ బయటివాడు కావడంతో అతడిపై ఎన్నో కుట్రలకు పాల్పడ్డారన్న ఆవేదన అందరిలో వ్యక్తమైంది. ఏదేమైనా సుశాంత్ ఆత్మహత్య వెనక రకరకాల కోణాలు ఆశ్చర్యపరిచాయి.
అయితే వీటన్నిటిపైనా సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు దర్శకనిర్మాత విజయ్ శేఖర్ గుప్తా. సుశాంత్ జీవన్మరణ వ్యవహారంపై సినిమా తీస్తున్నానని ప్రకటించడమే గాక .. ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. టైటిల్ ని ప్రకటించేశారు. సుశాంత్ జీవితం మరణం ఆధారంగా `సూసైడ్ ఆర్ మర్డర్?` తెరకెక్కనుంది. `ఏ స్టార్ వజ్ లాస్ట్` అనేది ఈ మూవీ శీర్షిక. షామిక్ మాలిక్ దర్శకత్వంలో వి.ఎస్.జి బింగే బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం మోనోక్రోమ్ ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. అయితే బాలీవుడ్ లోనే ఇదో వివాదాస్పద బయోపిక్ గా మిగులుతుందా? అన్న సందేహాల్ని పలువురు వ్యక్తం చేశారు. సుశాంత్ మరణించి ఎంతో కాలం కాకుండానే అప్పుడే ఇలా సినిమాని ప్రకటించడం సరికాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Motion poster of @vsgbinge's #SuicideOrMurder? A star was lost. #SushantSinghRajput #vsgbinge pic.twitter.com/v40auotxoI
— VIJAY SHEKHAR GUPTA BJP (Modi Ka Parivar) (@VijayShekhar9) June 18, 2020