500 కోట్ల ప్రాజెక్టులు .. 50వేల మంది ఉపాధి ఉఫ్!

tollywood

క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో టాలీవుడ్ కి న‌ష్టం ఎంత‌? లాక్ డౌన్ వ‌ల్ల‌ ప‌్ర‌స్తుత స‌న్నివేశ‌మేమిటి? అన్న‌ది ప‌రిశీలిస్తే షాకిచ్చే నిజాలెన్నో బ‌య‌ట‌ప‌డ్డాయి. టాలీవుడ్ లో దాదాపు 500 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు గాల్లో ఉన్నాయి. 50వేల మంది ఉపాధి ఉఫ్ మ‌ని ఎగిరిపోయింది. దాదాపు 1700 థియేట‌ర్లు తెలుగు రాష్ట్రాల్లో మూత ప‌డ్డాయి. ఇదంతా క‌రోనా విల‌యం. మ‌రో రెండు మూడు నెల‌లు థియేట‌ర్లు ఓపెన్ చేసే వీల్లేద‌ని తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్పారు. షూటింగుల‌కు ఎప్ప‌టికి అనుమ‌తులిస్తారో కూడా క్లారిటీ లేదు. కార‌ణం ఏదైనా వేలాది మంది బ‌తుకు వెల్ల‌దీయ‌లేని స‌న్నివేశం నెల‌కొంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కొంత‌వ‌ర‌కూ మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన సీసీసీ ఆదుకుంది. చాలా మంది సెల‌బ్రిటీలు కార్మికుల‌కు త‌మ స‌హాయ‌కుల‌కు సాయం చేశారు. లేదంటే ఈపాటికే ఎలాంటి ప‌రిస్థితి ఉండేదో ఊహించ‌డ‌మే క‌ష్టంగా ఉంది.

సినీప‌రిశ్ర‌మ‌లో ఏ రంగంలో ఎంత‌మంది ప‌ని చేస్తారు? అన్న‌ది అంచ‌నా వేస్తే… తెలుగు రాష్ట్రాల్లో 1100-1200 సింగిల్ స్క్రీన్లు.. 500 మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్లు సుమారుగా ఉన్నాయి. వీటిలో ఉపాధి పొందేవాళ్లు దాదాపు 25 వేల మంది ఉన్నారు. ఎగ్జిబిష‌న్ రంగంపై ఆధార‌ప‌డిన ఇంత‌మంది ఉపాధిని కోల్పోయారు. సినిమా ప్రొడ‌క్ష‌న్ పై ఆధార‌ప‌డిన వాళ్ల లెక్క‌లు తీస్తే.. ప్ర‌తియేటా 190-200 వ‌ర‌కూ స్ట్రెయిట్ సినిమాలు తెర‌కెక్కుతుంటే 50-70 వ‌ర‌కూ డబ్బింగ్ సినిమాలు రిలీజ‌వుతున్నాయి. ప్రొడ‌క్ష‌న్ పైనే ఆధార‌ప‌డి 15 వేల మంది బ‌తుకుతున్నారు. రోజూ సెట్స్ లో 150-200 మంది ప‌ని చేస్తుంటారు. రోజూ వివిధ లొకేష‌న్ల‌లో ఏకంగా 7500 మంది వ‌ర‌కూ ఉపాధి పొందుతూనే ఉన్నారు. ప్రొడ‌క్ష‌న్ ఆఫీసులు.. ల్యాబులు వీటిల్లో దాదాపు 7500 మంది ఉపాధి పొందుతున్నారు. వీరంతా ఇప్పుడు తిండికి లేని ప‌రిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఇప్ప‌టికే 25 సినిమాలు రిలీజ్ కి రాకుండా ఆగిపోయాయి. 50 పైగా సినిమాలు చిత్రీక‌ర‌ణ‌ల ద‌శ‌లో ఉన్నాయి. క‌రోనా దెబ్బ‌తో అంత‌కు రెట్టింపు సినిమాలు షూటింగుల‌కు వెళ్ల‌కుండా ఆగిపోవాల్సిన స్థితిలో ఉన్నాయి. అంటే ప్ర‌తియేటా 200 సినిమాలు తెర‌కెక్కుతుంటే.. ఈ ఏడాది అందులో స‌గం కూడా సెట్స్ కి వెళ్ల‌డం క‌ష్ట‌మే. ఇక రిలీజ‌య్యేవి కూడా ఎన్ని ఉన్నాయో చెప్ప‌లేం… అని టాలీవుడ్ నిర్మాత‌ల మండ‌లి కార్య‌ద‌ర్శి.. నిర్మాత టి.ప్ర‌స‌న్న‌కుమార్ విశ్లేషించారు.