కరోనా లాక్ డౌన్ వేళ సినీకార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సీసీసీ ద్వారా సేవలందిస్తుండగా పలువురు పలు రకాలుగా సాయపడుతున్నారు. సీనియర్ నటుడు గౌతం రాజు తనవంతుగా 200 మందికి సేవలందించడం హర్షణీయం.
నటుడు గౌతం రాజు మాట్లాడుతూ-“ చాలా షూటింగులు తూగో జిల్లాలో జరుగుతాయి. రాజమండ్రి- యానాం- కాకినాడ – మండపేట- పిఠాపురంలో జరుగుతుంటాయ. కరోనా మహమ్మారీ వల్ల అక్కడ జూ.ఆర్టిస్టులకు పనుల్లేవ్. షూట్ లేకపోతే పొలం పనులు చేసేవారు. ధైన్యంగా ఉన్నారంతా. నాకు ఆర్థిక సాయం చేసేంత లేకపోయినా మా అబ్బాయి .. కొంత సాయం చేశాడు. అమెరికాలో నా మిత్రుడు శేషగిరి.. న్యూజెర్సీలో మురళి .. బిగ్ బజార్ సూర్య.. చంద్రకాంత్ రెడ్డి. భీమవరంలో నా తమ్ముడు మహేష్.. కాకినాడ కిరణ్ కుమార్ (నిర్మాత) తమవంతు సాయం చేశారు. కొండయ్య అనే జూ.ఆర్టిస్టు కం సప్లయర్ సాయంతో 200 మందికి సాయం చేయదలిచాం. కల్కి, గంగ, మల్లేష్ గౌడ్ తదితరులం రామచంద్ర పురం మొదలు పెట్టి ఆర్థిక సాయం చేశాం. వంద మందికి ఇప్పటికే సాయమందించాం. ఈ సలహా ఇచ్చిన మా అబ్బాయికి ధన్యవాదాలు. మన ప్రధాని ముఖ్యమంత్రులు మన ప్రాణాలు కాపాడేందుకు నియమనిబంధనలు పెట్టారు. నెలాఖరు వరకూ పాటిద్దాం. కరోనాను తరిమేద్దాం. సేవలు చేస్తున్న పోలీస్.. డాక్టర్లకు అందరికీ పాదాభివందనాలు“ అని తెలిపారు.
కరోనా విధ్వంశం రైతుపైనా తీవ్రంగా ఉంది. పండించిన పంట అమ్ముడుపోని పరిస్థితి. దీనిపై నటుడు సాయికుమార్ తనదైన సందేశం ఇచ్చారు. సాయికుమార్ మాట్లాడుతూ-“జై రైతన్న ..రైతు దేశానికి వెన్నె ముక. రైతు లేనిదే మనం లేం. కరోనా దాడి వేళ రైతన్న ఇబ్బందిలో ఉన్నారు. అరటి, బత్తాయి, నిమ్మ, జామ వీటన్నిటినీ కొనుక్కుని తిందాం. రోగ నిరోధకత పెంచుకుందాం. రైతును కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకుందాం. రైతుకు మనం అవసరం. మనకు రైతు అవసరం. దేశాన్ని కాపాడుకుందాం.. జైహింద్“ అంటూ పిలుపునిచ్చారు.