షిర్డీ సాయిబాబా మహాసమాధిలోకి వెళ్లి 100 సంవత్సరాలు

షిర్డీలో కొలువైన బాబా అంటే తెలియని వారు, దర్శించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బాబా మహిమల గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. బాబాను మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్ నగర్లో వున్న  షిర్డీ  ఇప్పుడు ప్రముఖమైన పుణ్య క్షేత్రం. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు బాబాను సందర్శించి ఆశీస్సులు అందుకుంటారు. బాబాను అన్ని మతాల భక్తులు దర్శించుకుంటారు. బాబా అన్ని మతాలవారిని  సమంగా ప్రేమించాడు, అభిమానించాడు, ఆదరించాడు.

బాబా శివుని అవతారమని కొందరు నమ్ముతారు, దత్తాత్రేయుడే బాబా రూపంలో భూమి మీదకు వచ్చాడని మరికొందరు విశ్వసిస్తారు. బాబా పరమపదించి సోమవారం నాటికి 100 సంవత్సరాలు. ఈ సందర్భంగా షిర్డీ ట్రస్ట్, మహారాష్ట్ర ప్రభుత్వం శత వత్సరాల  వర్ధంతిని  ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆలయాన్ని నియాన్ లైట్లతో అలంకరించారు. బాబా గుడి, ఇతర మందిరాలను శోభాయ మానంగా అలంకరించారు.  ఈ వేడుకలను చూడటానికి ఇప్పటికే దేశం నలు మూలల   నుంచి  భక్తులు విశేష సంఖ్యలో వస్తున్నారు.

 

నిజానికి బాబా ఎప్పుడు పుట్టాడు?ఎక్కడ పుట్టాడు? ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే వివరాలు  ఎవరికీ తెలియవు. దీని మీద ట్రస్టు ఎంతో పరిశోధన చేయించింది, కానీ ఫలితం లేదు. 1922లో మరాఠీలో “శ్రీ సాయి  సత్ చరిత్ర ” అనే పుస్తకాన్ని  హేమద్ పంత్ అనే రచయిత  రాశాడు. హేమద్ పంత్ సాయిబాబా భక్తుడు. 2010 నుంచి బాబా ను దగ్గరగా చూశాడు. ఈ పుస్తకంలో బాబా 16 సంవత్సరాల  వయసులో షిరిడి వచ్చాడని , వేప చెట్టు క్రింద కూర్చొని ధ్యానంలో  ఉండేవాడని, ఆ రకంగా ప్రజలను ఆకట్టుకొని తన భక్తులను చేసుకున్నాడని హేమద్ పేర్కొన్నాడు. బాబా అంటే ప్రజల్లో నమ్మకం కలిగిందని, బాబా అందరిని సమంగా  ప్రేమించేవాడని ఆయన పేర్కొన్నాడు.

1918 ఆగష్టు మాసంలో బాబా తనకు సన్నిహితులైన శిష్యులను పిలిచి “తాను ఎక్కువ కాలంబ్రతకనని,  మీరు చూస్తున్న ఈ శరీరాన్ని వదలి  పెట్టి వెళ్లి పోతున్నానని” చెప్పాడట.  ఆతరువాత సెప్టెంబర్లో బాబాకు జ్వరం వచ్చింది. శరీరం ముట్టుకుంటే కాలిపోయేదట. ఆయన శిష్యులు చాల కంగారు పడ్డారట. అప్పుడు బాబా వారిని ఓదార్చి “తన శరీరం మీద పవిత్ర గ్రంధాన్ని ఉంచి, ప్రార్ధనలు  చేయండి, భక్తులను కూడా అనుమతిచండి  ” అని ఉద్బోదించాడట.

బాబా స్పృహ లేకుండా  రోజుల తరబడి ఉంటే భక్తులు విషణ్ణ వదనాలతో దర్శించుకున్నారట. చివరికి   15 అక్టోబర్ 1918న బాబా ఇహలోక యాత్ర ముగించాడు. ఆ నాటి నుంచి షిర్డీ ఒక పవిత్ర పుణ్య క్షేత్రమైంది, బాబా అవతార పురుషుడయ్యారు .

భగీరథ