నవ్వుల వేణుమాధవ్ ఇక లేరు
ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతకొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఈ నెల 6 నుంచి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో.. మంగళవారం ఆయన ఆరోగ్యం విషమించింది. దాంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. అయితే ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఈ మధ్యాహ్నం 12.21 గంటలకు మృతిచెందాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
సూర్యపేట జిల్లా కోదాడలో 1979 డిసెంబర్ 30న జన్మించారు. వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ మంచి బ్రేక్ ఇచ్చింది.
ఇక తనను నటుడిగా పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హంగామా’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ‘యువకుడు’, ‘దిల్’, ‘లక్ష్మి’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘మాస్’ చిత్రాలు కమెడియన్‌గా పేరు తెచ్చి పెట్టాయి.
2006లో వెంకటేశ్ హీరోగా.. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మి’ సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాదవ్ ‘నంది’ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన చివరిగా ‘రుద్రమదేవి’ చిత్రంలో కనిపించారు.