సీఎం జగన్,ఆయన పాలన పై ప్రభాస్ కామెంట్స్

వైయస్ జగన్ గురించి ప్రభాస్ ఏమన్నారంటే…

తన తాజా చిత్రం ‘సాహో’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ప్రభాస్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి స్పందించారు. తనకు రాజకీయాలు అంతగా తెలియవని చెప్పుకొచ్చిన ప్రభాస్.. ఏపీకి యంగ్ సీఎంగా ఉన్న జగన్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

వివరాల్లోకి వెళితే.. సాహో సినిమా ప్రమోషన్ లో భాగంగా తమిళ్ లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్. అప్పుడు తమిళ యాంకర్ ప్రభాస్ ని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై మీ అభిప్రాయం చెప్పమని అడిగారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 151సీట్లతో రికార్డు మెజారిటీ దక్కించుకున్న జగన్ దేశవ్యాప్తంగా పొలిటికల్ గా కూడా రికార్డ్ క్రియేట్ చేశారు. తమిళనాటలో జగన్ ను పొలిటికల్ బాహుబలిగా పిలుస్తున్నారని, ఆయన గురించి మీరు ఏం అనుకుంటున్నారు అని యాంకర్ ప్రభాస్ ని ప్రశ్నించారు. ఒకరకంగా ఇది ఇరుకున పెట్టే ప్రశ్నే. దానికి ప్రభాస్ చాలా తెలివిగా డిప్లమెటిక్ గా సమాధానమిచ్చారు.

ఈ ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ.. రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు, అయినా జగన్ ప్రభుత్వ పాలన ఈ మధ్యనే మొదలైందని, చూస్తూంటే జగన్ బాగా పని చేస్తున్నాడనిపిస్తోందని అన్నారు. జగన్ యువ ముఖ్యమంత్రి అని, ఆంధ్రప్రదేశ్ జగన్ హయాంలో బాగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రబాస్ ఇలా మాట్లాడటం ఓ వర్గానికి మింగుడుపడటం లేదు.