సినిమాల్లో క్వాలిటీ త‌గ్గిందంటున్న సురేష్‌బాబు

”మనం మంచి సినిమాలు తీస్తున్నాం. చాలామంది సినిమాలు తీశాం. కానీ పాతరోజుల్లో తీసిన మంచి సినిమాలుకంటే ఇప్పటి సినిమాలు గొప్పగా అనిపించవు. ఎన్ని రొమాంటిక్‌ చిత్రాలు వస్తున్నా ‘ప్రేమించుకుందాంరా’ కంటే మిన్నగా అనిపించవు. ఎన్ని కుటుంబకథా చిత్రాలు వస్తున్నా ‘కలిసుందాంరా’ కన్నా బెటర్‌గా అనిపించవు. కానీ అన్ని సినిమాలు ఆడుతున్నాయి. ఇప్పుడు మా బేనర్‌లో వస్తున్న ‘వెంకీమామ’ మరోసారి కుటుంబ ప్రేక్షకుల్ని బాగా అలరించగలదని చెప్పగలను” అని నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. ఆయనతో పార్టనర్‌గా విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాబీ దర్శకుడు వహించాడు. వెంకటేష్‌, నాగచైతన్యలు మేనమామ, మేనల్లుడుగా నటించారు. ఈ చిత్రం ఈనెల 13న విడుదల కాబోతుంది.

 

ఈ సందర్భంగా డి. సురేష్‌బాబు మాట్లాడుతూ… వెంకీమామ కథను ఐడియా రూపంలో జనార్దన మహర్షి చెప్పాడు. దానికి చాలా మెరుగులు దిద్దాల్సివచ్చింది. అప్పటికే వెంకటేష్‌కు కథలు కోసం వెతుకుతున్నాం. ఈ కథ ఐడియాను కోన వెంకట్‌కు చెప్పడం, ఆయన అద్భుతంగా వుందనడం జరిగింది. ఆ తర్వాత ఈ కథకు దర్శకుడు బాబీ అయితే బాగుంటుందని కోన సూచించాడు. తనతో చర్చల్లో పాల్గొన్నాం. అప్పుడు బాబీ.. ఒరిజినల్‌ కథలోలేని వర్షన్‌తో ఓ సీన్‌ చెప్పాడు. అది వినగానే హార్ట్‌టచ్‌గా అనిపించింది. వెంటనే కన్నీళ్ళు వచ్చాయి. అంత బాగా డీల్‌ చేశాడు. ఆ తర్వాత మరికొన్ని సీన్లు ఇలా వుండాలి, అలా వుండాలని కొన్ని మార్పుల చేసి ఫైనల్‌ అవుట్‌పుట్‌ తెచ్చాం.

 

– వెంకీమామ.. చక్కటి కుటుంబకథా చిత్రం. నేను నాన్నగారి దగ్గర నుంచి ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూస్తూనే చాలా కథలు విన్నాను. ఇప్పుడు ఎన్ని కథలు విన్నా.. పాతరోజుల్లో సినిమాలకంటే బెటర్‌ అనిపించదు. అలా అనిపించాలంటే ఏదో కొత్తదనం చూపించాలి. అందుకే నేడు సినిమాలు ఎన్ని వచ్చినా ఆడుతున్నాయి. ఈ వెంకీమామ అందరినీ అలరించే చిత్రం అవుతుందని చెప్పగలను. ముఖ్యంగా మేనమామ, మేనల్లుడు మధ్య జరిగే సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ టచ్‌ చేస్తాయి.

 

– ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ముందుగా ఒక డేట్‌ అనుకున్నాం. వెంకటేష్‌ కాలికి గాయమైతే చిత్రీకరణ వాయిదా పడింది. ఆ కారణంతో ఈనెల 13న వస్తున్నాం. జనవరిలో రావాలంటే మూడు, నాలుగు సినిమాలున్నాయి. అన్నిచోట్ల థియేటర్లు దొరకవు. కొన్ని ఊళ్ళల్లో రెండు, మూడు థియేటర్లే వుంటాయి. అక్కడ ఈ సినిమా పడదు. అందుకనే భవిష్యత్‌లో అక్కడ కూడా మల్టీప్లెక్స్‌ థియేటర్లు కడితే రోజూ ఒక షో పడినా అన్ని సినిమాలు వున్నాయనే ఫీలింగ్‌ అక్కడి ప్రేక్షకుల్లో లుగుతుంది.

 

– ఇప్పుడు క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సివుంది. ఐదేళ్ళ క్రితం టీవీ షోలకు, ఇప్పటికీ చాలా తేడా వుంది. క్వాలిటీలో తేడా కన్పిస్తుంది. ఏడుపు సీరియల్స్‌ చూసేవారికి జబర్‌దస్త్‌ వచ్చి అలరించింది. మా వెంకీమామ చిత్రం కూడా గుడ్‌ క్వాలిటీతో వస్తుంది. ముఖ్యంగా క్వాలిటీ విషయంలో చాలా మంది నిర్మాతలు వెనకంజ వేస్తున్నారు. సరైన ప్లానింగ్‌ లేకపోవడమే ఇందుకు కారణం. చాలా రోజులపాటు చిత్రీకరణ చేయడంతో చాలా వేస్టేజ్‌ అవుతుంది. దాన్ని కంట్రోల్‌ చేయాలి. హిందీలో అక్షయ్‌కుమార్‌ 35 డేస్‌లో సినిమాలు చేస్తున్నాడు. అయినా క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. దాన్ని బేస్‌చేసుకుని మన నిర్మాతలు చాలా మంది మారాలి. ‘ట్రాన్స్‌ఫార్మర్‌’ అనే హాలీవుడ్‌ సినిమాను 8 వారాల్లో తీసేశారు. దానికి ముందు ప్రీప్రొడక్షన్‌, పక్కా ప్లానింగ్‌ అవసరం’ అని తెలిపారు.

 

– ప్రస్తుతం ఇండస్ట్రీలో తప్పనిసరిగా పెద్దదిక్కు కావాలి. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి అప్పట్లో దాసరినారాయణరావుగారు వున్నారు. అందుకు అందరూ సమ్మతించారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం అవసరం. ఇప్పటి పరిస్థితుల్లో ఎవరు ఎవర్ని అంగీకరిస్తారో తెలీదు. నా మటుకు ఇలాంటి బాధ్యత చేయాలంటే కష్టమే. మరో నిర్మాత విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు ఇండివిడ్యువల్‌గా చేస్తున్నాం. ‘వెంకీమామ’ లాంటి కొన్ని భాగస్వామ్యంతో చేస్తున్నాం. సురేష్‌బాబుగారి దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నా. నిర్మాతగా ఎలా వుండాలి. ఎలా మార్కెట్‌ చేయాలనేది గ్రహించాను అని తెలిపారు.