‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి ఏం మాట్లాడాడంటే…
ప్యాన్ ఇండియా మూవీగా భారీ హైప్ క్రియేట్‌చేసిన సాహో రిలీజ్‌కు సిద్దమవుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆదివారం సాయంత్రం సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీ ఎత్తున నిర్వహించారు. ఈ పంక్షన్ లో బాహుబలి దర్శకుడు రాజమౌళి మాట్లాడారు.
ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడుతూ..‘‘సాధారణంగా ఏ హీరో అభిమాని అయినా తన హీరో సినిమా హిట్ కావాలని కోరుకుంటారు. కానీ, అందరి హీరోల అభిమానులు ప్రభాస్ సినిమా హిట్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభాస్ అన్ని విషయాల్లోనూ పాజిటివ్‌గా ఉంటాడు. ‘బాహుబలి’ తీస్తున్న సమయంలోనే తన తర్వాత చిత్రమేంటో ప్రభాస్ ఆలోచించారు. ఒక రోజు నా దగ్గరకు వచ్చి సుజీత్ కథ గురించి నాకు చెప్పాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే.. పెద్ద సినిమా చేసిన తర్వాత, పెద్ద డైరెక్టర్‌తో చేయాలని కాకుండా, సుజీత్ చెప్పిన కథను నమ్మి ఈ సినిమా చేశాడు.
‘బాహుబలి’ తర్వాత ఈ సినిమా అయితే, నా ఫ్యాన్స్‌కు నచ్చుతుంది అని చెప్పి చేశాడు. ఇంత పెద్ద సినిమాను సుజీత్ చేస్తాడా? అని చాలా మందికి అనుమానం ఉంది. ఫస్ట్‌లుక్ చూసినప్పుడే సినిమా స్థాయి ఏంటో తెలిసింది. టీజర్‌తో అది నిజమని అనిపించింది. ట్రైలర్‌తో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. చాలా బాగా చేశాడు. అంత పెద్ద టెక్నీషియన్స్, బడ్జెట్, స్టార్స్‌ను పెట్టుకుని చేయడం మామూలు విషయం కాదు. ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్‌లా సినిమా చేశాడు. ఇలాంటి సినిమా తీయాలంటే నిర్మాతలకు ఎంతో ధైర్యం ఉండాలి. నిజంగా వాళ్ల అభినందిస్తున్నా. ఆగస్టు 30న పెద్ద రికార్డులు సృష్టిస్తుంది. ప్రభాస్ ఇప్పటికే ఆలిండియా స్టార్. ఇక సినిమాతో ఎంతో మరో మెట్టు ఎదుగుతాడు’’అని చెప్పుకొచ్చారు.