వ‌ర్మ‌తో సినిమా తీస్తా

”బ్రహ్మానందం, నేను ఒకేసారి సినిమారంగంలో ప్రవేశించాం. అప్పటికీ ఇప్పటికీ ఇండ్రస్టీలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కృష్ణానగర్‌లో పస్తులున్న సందర్భాలున్నాయి. కొత్తగా వేషం ఇస్తారంటే చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఆఫీసులోనికి ప్రవేశించగానే నిర్మాత, దర్శకుడు లోపలవుండేవారు. వెళ్ళగానే వారి కాళ్ళకు దండం పెట్టాలి. అది నాకు నచ్చలేదు. గౌరవం అనేది స్వతహాగా రావాలి. అప్పట్లోనే భాగవతాలు, భక్తి, జానపదాలు, సాంఘికాలు, యాక్షన్‌, ప్రేమకథలు వెండితెరపై వచ్చేశాయి. ఇప్పుడు తీయడానికి ఏమీలేవు. ఇప్పుడు సరైన కంటెంట్‌ దొరకడం కష్టమైపోయింది. కంటెంట్‌తో తీస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. మా సినిమాకు అలా ప్రేక్షకులు నీరాజనాలు పడతారని నేను గట్టిగా నమ్ముతున్నానని” ‘ఊల్లాల.. ఊల్లాల’ చిత్ర నిర్మాత ఎ. గురురాజ్‌ తెలియజేస్తున్నారు. ‘రక్షకభటుడు, ఆనందం మళ్లీ మొదలైంది, లవర్స్‌ డే’ తర్వాత ఆయన నిర్మించిన చిత్రమిది.
సీనియర్‌ నటుడు సత్యప్రకాష్‌ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్‌ పతాకంపై నటరాజ్‌ని హీరోగా, నూరిన్‌, అంకిత హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. కొత్త కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకి జనవరి 1న వస్తున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత ఎ.గురురాజ్‌ విలేకర్లతో వివరించారు.

 

నిర్మాత క‌దా న‌టుడుగా చేయ‌డానికి కార‌ణం?

నటుడు అవ్వాలనే 1990లో పరిశ్రమకు వచ్చాను. ఇప్పటివరకు చిన్న చిన్న వేషాలు మాత్రమే వేశాను. కానీ ‘ఊల్లాల ఊల్లాల’లో మాత్రం కథని నడిపించే పాత్రని నేను కచ్చితంగా వేయాల్సి వచ్చింది. అనుకున్నట్టుగానే నా పాత్ర బాగా రావడమే కాక చిత్రానికి బాగా పనికొచ్చింది.

 

పోస్టర్‌లో గుర్రం, అమ్మాయి.. గురించి?

అది సస్పెన్స్‌. ఆ పోస్టర్‌ చూస్తేనే సినిమా ఎంత వైవిధ్యంగా ఉండబోతుందో అర్ధం అవుతుంది. సినిమాకి వచ్చిన ప్రేక్షకుడికి ఆ పోస్టర్‌ చూశాక పెరిగిన అంచనాలన్నీ థియేటర్‌లో తెరమీద దొరుకుతాయి.

 

దర్శకుడుతో అనుభందం ఎలాంటిది… క‌థ గురించి?

సత్య ప్రకాష్‌ ఇతర నటులలాగే సినిమాల్లోనే పరిచయం. సినిమాలో ఎంత క్రూరమైన విలన్‌లా కనిపిస్తాడో ఆయన బయట పెద్ద భక్తుడు. ఒకరోజు అనుకోకుండా ‘ఒక పాయింట్‌ చెప్తా వింటావా’ అని అన్నారు. అలా అప్పుడు చెప్పిన లైన్‌ని తీసుకొని స్టోరీగా డెవలప్‌ చేసి కొత్త కంటెంట్‌తో వినోదాత్మకంగా చూపించాం.

 

కంటెంట్‌ నమ్ముకునే సినిమాలు చేశాం అన్నారు, అది ప్రూవ్‌ అవుతుందనుకుంటున్నారా?

కొన్ని చిత్రాల ఫలితం అనుకున్నట్టుగా రావు. పెద్ద హీరోలని పెట్టి తీసినా కంటెంట్‌ లేకపోతే సినిమాలు ఆడవు, ప్రేక్షకులు చూడరు. అలాగే మంచి సినిమాలు చిన్నవైనా, పెద్దవైనా ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు కథ విన్నప్పటికి తీసి విడుదలయ్యే సమయానికి కథనాల్లో చాలా మార్పులొచ్చేస్తాయి, కానీ ఈసారి అలా జరగకుండా సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుండి గుమ్మడికాయ కొట్టే వరకు అన్ని దగ్గరుండి గమనిస్తూ జాగ్రత్తలు వహిస్తూ పూర్తిగా ఇంవోల్వ్‌ అయ్యి అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేశాం.

 

నిర్మాతగా ఎదురుకున్న చేదు అనుభవాలు ?

మొదట్లో కొన్ని అనుభవాలు జరిగాయి. ఇక్కడ అందరూ మంచివాళ్ళే. ఏ రంగంలోనూ లేనివిధంగా 24 క్రాఫ్ట్స్‌వారు తెల్లవారుజామున 4గంటలకు లేచి అర్థరాత్రి వరకు తమతమ విధుల్లో కష్టపడిపనిచేస్తారు. అయితే ఐదుశాతంమంది మోసగాళ్లూ వున్నారు. మొదట్లో ఉన్న పరిశ్రమకి ఇప్పటికి చాలా మార్పులు, అభివృద్ధులు జరిగాయి. అవకాశాలు కూడా పెరిగాయి. ఎప్పటినుండో పరిశ్రమలో ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల అనుకున్నవి జరగలేదు, కష్టాలు ఎదురయ్యాయి. నిర్మాతలమండలినుంచి సరైన సపోర్ట్‌లేదు. ఆ తర్వాత మా స్థాయి పెరిగాక పరిస్థితులు మారాయి. నేను స్టార్‌ అవ్వడం కంటే రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఎదిగి కొన్ని లక్షల మందికి గృహాలు, వేలమందికి ఉపాది óకల్పించడంపట్ల చాలా ఆనందంగా వుంది.

 

రామ్‌గోపాల్‌ వర్మతో సినిమా చేస్తున్నారా?

ఆయన గురించి నేను బయట నెగటివ్‌గా విన్నదానికి ఆయన నిజంగా ఉన్నదానికి చాలా తేడా ఉంది, నేను మా ఆడియోకు పిలవగానే మొదట్లో చిత్రానికి సంబంధం లేదు కాబట్టి రాను అన్నారు కానీ మీరొస్తే మా చిత్రానికి ప్లస్‌ అవుతుంది అనగానే ఈవెంట్‌కి వచ్చారు, అన్ని కుదిరితే ఆయనతో ఒక ప్రాజెక్టు చేయడం మాకు చాలా సంతోషం. ఇది కాకుండా త్వరలో ఓ స్టార్‌ హీరోతో సినిమా చేయబోతున్నా. ఆ వివరాలు తర్వాత వెల్లడిస్తా.

gururaj

స్టూడియో ఆలోచన ఏమైనా ఉందా?

సుఖీభవ పేరుతో వేరు వేరు సంస్థలు స్థాపించాలనే ఆలోచనలో ఉన్నా. అన్నీ కుదిరితే ఆ వైపు కూడా ఆలోచిస్తాము.