తమిళ నాడులో రాజకీయ కక్ష సాధింపులు సర్వసాధారణం. జయలలిత, కరుణానిధిల హయాంలో ఒక వర్గాన్ని మరో వర్గం ఇబ్బందులకు గురిచేయడం, లేని కేసులు బనాయించడం తెలిసిందే. వీరి తరువాత ఇప్పుడు హీరో విజయ్ టార్గెట్‌గా మారారు. గత కొంత కాలంగా అధికార బీజేపీ వ్యతిరేకంగా తన సినిమాల్లో డైలాగ్‌లు, సన్నివేశాలు వుండేలా చూసుకుంటున్నారు విజయ్.
దీంతో విజయ్‌ని ఓ వర్గం టార్గెట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో వున్న పళనిస్వామి ప్రభుత్వం అధికార బీజేపీకి సపోర్ట్‌గా నిలుస్తోంది. దాంతో బీజేపీ శ్రేణులకి అడ్డంకిగా మారిని విజయ్‌ని తమిళనాడు ప్రభుత్వం టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇటీవల విజయ్ ఇంటిపై ఆకస్మికంగా ఐటీ అధికారులు దాడులు చేయడం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది.
`మాస్టర్` షూటింగ్ జరుగుతుండగా లొకేషన్ నుంచి నేరుగా హీరో విజయ్‌ని ఇంటికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు అతని కళ్లముందే ఇంట్లో సోదాలు నిర్వహించడంతో ఆగ్రహించిన విజయ్ ఫ్యాన్స్ వేలల్లో విజయ్ ఇంటికి చేరుకోవడం సంచలనంగా మారింది. తాజాగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మళ్లీ విజయ్ ఇంటిని స్థానిక అధికారులు టార్గెట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
చెన్నై నగరపాలక సంస్థ అధికారులు వైద్య బృందంతో ఇంటింటిని చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయ్ ఇంటి సభ్యుల్ని కూడా చెక్ చేసి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇది హీరో విజయ్‌పై కావాలని చేసిన కుట్ర అని విజయ్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.