రచయిత విజయేంద్ర ప్రసాద్ క్రేజు అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. బాలీవుడ్‌లో ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ. ముఖ్యంగా బాహుబలి సక్సెస్ తర్వాత అతడికి క్షణం తీరిక లేని పరిస్థితి. భజరంగి భాయిజాన్ సక్సెస్ తో మరో రేంజు రైటర్ గా ఎదిగారు. స్టార్ రైటర్ గా విలక్షణ మైండ్ సెట్ ఉన్నవాడిగా ఆయన గత కొన్ని నెలలుగా హిందీలో పలు చిత్రాలకు పని చేస్తున్నాడు.
విజయేంద్ర ప్రసాద్ హిందీలో రాసిన కొన్ని స్క్రిప్ట్స్ త్వరలో సెట్స్ కి వెళ్లనున్నాయి. కంగన డెబ్యూ డైరెక్టర్ గా రంగ ప్రవేశం చేయనున్న ఓ చిత్రానికి విజయేంద్రుడు స్క్రిప్ట్ అందిస్తుండడం విశేషం. నిజానికి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు అందించిన మణికర్ణిక చిత్రానికి కంగననే దర్శకత్వం వహించిందని అప్పట్లో ప్రచారం సాగింది. దర్శకుడు క్రిష్ తో కంగనకు క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం ఆ క్రమంలోనే సగభాగం మణికర్ణిక చిత్రాన్ని కంగననే తెరకెక్కించిందని ప్రచారమైన సంగతి విధితమే. అయితే ఈసారి అలా కాదు.. పూర్తి స్థాయి దర్శకురాలిగా బరిలో దిగుతోందట.
అలాగే కంగన – విజయేంద్ర ప్రసాద్ జోడీ తలైవి చిత్రానికి పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దివంగత సీఎం జయలలిత బయోపిక్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో టైటిల్ పాత్రలో కంగన నటిస్తుండగా ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇక విజయేంద్ర ప్రసాద్ ఇటు తెలుగు స్క్రిప్టు ఆర్.ఆర్.ఆర్ సహా అటు తమిళ – హిందీ పరిశ్రమల స్క్రిప్టులకు డీన్ గా పని చేస్తున్నారు. ఆయన కొన్ని వెబ్ సిరీస్ కథల్ని అందించారు. ప్రముఖ ఓటీటీల కోసం ఈ స్క్రిప్టుల్ని వండి వార్చే పనిలో దర్శకులు ఉన్నారు.