లేడీ డాన్‌గా నమిత కొత్త సినిమా

సొంతం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ నమిత. ఆ తర్వాత జెమినీ, ఒక రాజు ఒక రాణి, ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి వంటి తెలుగు సినిమాలలో వరుసగా నటించింది. తర్వాత అమ్మడు కొంచం లావెక్కడంతో తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి. 2009 లో బిల్లా మూవీలో చేసిన లిసా క్యారెక్టర్ మంచి గుర్తింపు తెచ్చింది కానీ అవకాశాలు మాత్రం దక్కలేదు. ఆ తర్వాత 2010 లో సింహా మూవీలో కనిపించడమే.. మళ్లీ ఇప్పటి వరకు తెలుగులో కనిపించలేదు నమిత. కానీ బొద్దుగా ఉన్న భామలని లైక్ చేసే తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటిస్తూనే ఉంది.

పెళ్లి తర్వాత ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు నమిత. తాజాగా తమిళ దర్శకుడు టీ.రాజేందర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండ్ర‌య కాద‌ల్ డా’ అనే మూవీలో నటించటానికి ఓకే చెప్పినట్టు సమాచారం. రొమాంటిక్ డ్రామా తరహాలో సాగే ఈ మూవీలో నమిత లేడీ డాన్‌లా కనిపించనుందని సమాచారం. 3 భాషల్లో రానుంది ఈ సినిమా. అందరు కొత్త నటులే కనిపించనున్నారని డైరెక్టర్ టీ.రాజేందర్ తెలిపారు. పెళ్లి తర్వాత నమిత నటించనున్న మొదటి సినిమా తనకి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.