యంగ్ హీరో కూడా అదే జ‌పం చేస్తున్నాడు

యంగ్ హీరో కూడా అదే జ‌పం చేస్తున్నాడు

టాలీవుడ్‌లో ఎవ‌రిని క‌దిలించినా ఒకే మాట వినిపిస్తోంది.. పాన్ ఇండియా.. పాన్ ఇండియా.. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు ప్రస్తుతం ఇదే పేరుని జ‌పిస్తున్నారు. తెలుగులో ఇప్ప‌టికే `ఆర్ ఆర్ ఆర్‌`, అల్లు అర్జున్ `పుష్ప‌`, ప్ర‌భాస్ న‌టిస్తున్న `జాన్‌` చిత్రాలు పాన్ ఇండియా స్థాయి చిత్రాలుగా రూపొందుతున్నాయి.

ఇదిలా వుంటే యంగ్ హీరో నిఖిల్ తన సినిమా కూడా పాన్ ఇండియా స్థాయి చిత్ర‌మే అంటున్నాడు. నిఖిల్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `కార్తికేయ 2`. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా వున్న మిస్ట‌రీ ఆల‌యాల నేప‌థ్యంలో రూపొందించ‌బోతున్నారు. కాశీ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు వున్న ప్ర‌ధాన ఆల‌యాల నేథ్యంలో ఆద్యంత ఆస‌క్తిక‌రంగా ఈ సినిమా సాగ‌నుంద‌ట‌.

తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ వెర్ష‌న్‌ల‌కు నిఖిల్ త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకోబోతున్నాడ‌ట‌. ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్‌` టీజ‌ర్‌కు చెప్పిన‌ట్టే త‌ను చెప్పుకోవాల‌ని వుంద‌ని చెబుతూ పాన్ ఇండియా జ‌పం చేస్తున్నాడు.