మెగా వెబ్ సిరీస్ ఆలోచ‌న‌లో మెగాస్టార్

మెగా వెబ్ సిరీస్ ఆలోచ‌న‌లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి త్వ‌ర‌లో డిజిట‌ల్ ప్ర‌వేశం చేయ‌నున్నారా? మెగా కాంపౌండ్ హీరోల‌తో ఓ మెగా వెబ్ సిరీస్ తెర‌కెక్కినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదా? .. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. మెగా వెబ్ సిరీస్ కు ఆస్కారం లేక‌పోలేద‌ని స్వ‌యంగా చిరు ఓ చిట్ చాట్ లో హింట్ ఇవ్వ‌డం ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ న‌డుస్తోంది. డిజిట‌ల్ – ఓటీటీదే భ‌విష్య‌త్ అన్న‌ది ఖాయ‌మైపోయింది. ప్ర‌స్తుత క‌రోనా విజృంభ‌ణ ప్ర‌పంచానికి ఎన్నో పాఠాల్ని నేర్పిస్తోంది. ఇంకా జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చూడాలి! అన్న పాత ప‌ద్ధ‌తికి మునుముందు చెక్ ప‌డిపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న అవగాహ‌న ప్ర‌పంచానికి వ‌చ్చింది. క‌రోనా క‌ల్లోలం టెంప‌ర‌రీ కావ‌చ్చు.. కానీ క‌రోనా పాఠం మాత్రం అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల‌కు గ‌ట్టిగానే అర్థ‌మైంది. అందుకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మైండ్ లోనూ వెబ్ సిరీస్ ఆలోచ‌న మెదిలింద‌ని అభిమానులు గెస్ చేస్తున్నారు. “ఇటీవ‌ల‌ వెబ్ సిరీస్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. నేను వాటిపై దృష్టి సారిస్తున్నాను. వెబ్ సిరీస్ ల‌లో ప్ర‌తీ న‌టుడు.. న‌టీ త‌మ‌ని తాము కొత్త‌గా ఆవిష్క‌రించుకునే అవ‌కాశం ద‌క్కుతోంద‌ని పూరి నాతో అన్నాడు“ అని చిరు వ్యాఖ్యానించారు. ఇక క‌రోనా వ‌ల్ల ప్ర‌మాదం కొంత‌కాలం వ‌ర‌కే.. ఆ త‌ర్వాత సినిమా ప‌రిశ్ర‌మ య‌థావిధిగా పురోగ‌మిస్తుంద‌ని చిరు అన‌డం కొస‌మెరుపు. ప్ర‌స్తుత స‌న్నివేశానికి చిత్ర‌ప‌రిశ్ర‌మ భ‌య‌పడాల్సిన ప‌ని లేద‌ని ఆయ‌న‌ అన్నారు. మెగాస్టార్ ఇచ్చిన హింట్ ని బ‌ట్టి త్వ‌ర‌లోనే ఓ మెగా వెబ్ సిరీస్‌ని చూసే అవ‌కాశం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. దీనికి పూరి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ ముందుకొస్తున్నాడ‌ని కూడా అనుకోవ‌చ్చు.