‘చష్మే బద్దూర్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది తాప్సి. తర్వాత ‘నామ్ షబానా, పింక్, జుడ్వా 2’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు ధరించి అక్కడి ప్రేక్షకుల మన్నన పొందింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘ముల్క్’. ఇందులో తాప్సిది ప్రధాన పాత్ర. అనుభవ్ సిన్హా డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో ప్రతీక్ బబ్బర్, రిషి కపూర్ కీ రోల్స్ లో కన్పిస్తున్నారు. తాప్సి ముస్లిం కుటుంబానికి చెందిన యువతిగా కినిపించనున్న ఈ మూవీ ‘ఇస్లామోఫోబియా’ నేపథ్యంలో తెరకెక్కనుంది.
తాప్సి ఈ సినిమాలో న్యాయవాదిగా కనిపించనుంది. ‘ముల్క్’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ‘సినిమా ఒప్పుకోవడానికి కారణం ముస్లింలు’ అని వెల్లడించింది. ‘ఎక్కడైనా పేలుళ్లు, కాల్పులు జరిగితే అందుకు కారణం ముస్లింలేనని వారిని విమర్శిస్తుంటారు. అలాంటివి వింటే నాకు చాలా బాధగా అనిపిస్తుంటుంది. కోపం కూడా వస్తుంది. ఎందుకంటే ముస్లిం మతానికి చెందిన ఎవరో కొందరు ఉగ్రవాదులు దాడి చేస్తే ముస్లింలు అందరిని నిందిస్తారు, అది కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో చాలామంది ముస్లింలతో కలిసి పని చేస్తుంటాను. వారందరిని ఉగ్రవాదులతో పోల్చలేము కదా. ముస్లింలు అందరు చెడ్డవారు కాదు. వారికి మద్దతు తెలపడానికి ఈ సినిమాలో నటిస్తున్నా’ అని చెప్పింది తాప్సి.