నటి విజయనిర్మల గత ఏడాది జూన్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో దర్శకురాలిగా ప్రత్యేక స్థానం పొందిన ఆమె జీవిత కథని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో విజయనిర్మల పాత్రని కీర్తి సురేష్ చేయబోతోందంటూ ఇటీవల వరుస కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, బయోపిక్ కోసం తమని ఎవరూ సంప్రదించలేదని సీనియర్ నరేష్ స్పష్టం చేశారు.
అమ్మ బయోపిక్ విషయంలో ఎవరికీ అనుమతి ఇవ్వలేదని, అలాంటి వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదన్నారు. అయితే అమ్మ బ్రతికున్న సమయంలోనే తన బయోపిక్ కోసం తనని స్క్రిప్ట్ రాయమన్నారని, అమ్మ చెప్పినట్టే బయోపిక్ కోసం కథ రాయడం మొదలుపెట్టానని, అమ్మ ఆరోగ్యం క్షీణించడంతో కథరాయడం పక్కన పెట్టానని నరేష్ చెప్పుకొచ్చాడు. అమ్మ కన్నుమూసిన తరువాత కొంత కాలం బయోపిక్ రాయడం ఆపేశానని, ప్రస్తుతం మళ్లీ మొదలుపెట్టానన్నారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో దర్శకురాలిగా స్థానం దక్కించుకున్న ఆమె 44 చిత్రాలు రూపొందించారని, అమ్మ గొప్ప నటి అని, మంచి నిర్మాత కూడా అని నరేష్ అన్నారు. మళ్లీ స్క్రిప్ట్ రాయడం ఇప్పుడే మొదలుపెట్టానని, వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనని చెప్పారు. ఈ కథకు దర్శకత్వం మీరే వహిస్తారా అంటే స్క్రిప్ట్ పూర్తయ్యాక చెబుతానని, ఇప్పుడే ఏ విషయం చెప్పలేనన్నారు.