బాలయ్య కొత్త సినిమా..ఈ ఏరియాల్లో హాట్ కేకు

బాలయ్య కొత్త చిత్రం బిజినెస్ డిటేల్స్

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. డిసెంబర్ 20 న విడుదల చేయటానికి నిర్ణయించిన ఈ చిత్రం యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా గా డిజైన్ చేస్తున్నారు. బాలయ్య తరహా సన్నివేశాలు ఉంటూనే కె.ఎస్ రవికుమార్ కొత్తగా ఆయన్ని చూపటానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హిట్ కాంబినేష‌న్‌లో `జైసింహా` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత రూపొందుతున్న చిత్ర‌ం కావటంతో ట్రేడ్ లోనూ మంచి క్రేజ్ నెలకొని ఉంది.

మరో ప్రక్క ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమైంది. అందుతున్న సమాచారం మేరకు వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ప్రముఖ పంపిణీదారులు ఉషా పిక్చర్స్ వారు తీసుకున్నారు. అలాగే నైజం ఏరియాకు ఏషియన్ ఫిల్మ్స్ వారు తీసుకున్నారు. మిగతా ఏరియాలకు బిజినెస్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి.

రీసెంట్ గా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. అయితే సినిమా టైటిల్ ఏంటో ఇప్పటి వరకూ రివీల్ చెయ్యలేదు. ‘రూలర్‌’ అనే టైటిల్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు ‘జడ్జిమెంట్‌’, ‘డిపార్ట్‌మెంట్‌’ లాంటి టైటిల్స్ కూడా బయటకు వచ్చాయి. వీటిలో ఒకదాన్ని త్వరలోనే ఖరారు చేసే అవకాశాలున్నాయని సమాచారం.

ఈ చిత్రానికి ప‌రుచూరి ముర‌ళి క‌థ‌ను అందిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తుండ‌గా రామ్‌ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రామ్‌లక్ష్మ‌ణ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. చిన్నా ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈనెల 18 నుంచి రామోజీ ఫిలింసిటీలో కొత్త షెడ్యూల్‌ మొదలుకానుంది.