లాక్‌డౌన్ వేళ అంతా ఇంటికే పరిమితమైపోయారు. సినిమా వాళ్లు మాత్రం ఏంటీ మా పరిస్థితిని అని ఆలోచనలో పడ్డారు. చాలా వరకు సినిమాలన్నీ షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. కొన్ని రిలీజ్‌కు సిద్ధమై ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థిలో రేపటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. అయితే రాజమౌళి మాత్రం రేపు అందించబోయే సవాళ్లకు సిద్ధంగా వుండాలని, కాలంతో పాటే మనం కూడా అపడేట్ కావాలని చెబుతున్నాడు.
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మళ్లీ కేంద్ర లాక్ డౌన్‌ని మే 3 వరకు పొడిగించింది. దీంతో ఇంటి పట్టునే వుంటున్న వాళ్లంతా ఎవరికి తోచిన పని వారు చేస్తున్నారు. రాజమౌళి కూడా తన సినిమా పనుల్లో నిమగ్నమైపోయారు. తాజాగా శనివారం ఓ మీడియా వేదికగా లైవ్‌లోకి వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్న ఆయన ముగ్గురు స్టార్ హీరోల గురించి, ప్రభాస్ గురించి చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ప్రభాస్ గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
`స్టూడెంట్ నెం.1` సమయంలో తనకు ఇలాంటి హీరో లభించాడేంటని బాధపడిన తను ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఎన్టీఆర్ నటన చూసి తన అభిప్రాయం తప్పని, ఇతనిలో ఏదో స్పార్క్ వుందని తెలుసుకున్నాడట. ఇక `మగధీర` సమయంలో కాజల్ చనిపోతున్న వేళ రామ్‌చరణ్ కళ్లతో పలికించిన హావ భావాలకు ముగ్ధుడయ్యాడట. ఈ ఇద్దరి తరువాత ప్రభాస్ గురించి చెప్పిన జక్కన్న అతను మాట్లాడుతున్న తీరు వెర్రిబాగులాడిలా వుంటుందని, కానీ ఆ ముసుగు తొలగిస్తే మాత్రం అతన ఫిలాసఫర్ అని, అతన్ని అత్యంత దగ్గరగా చూసే వాల్లకే అది తెలుస్తుందని, తనతో ప్రేమతో పాటు వ్యక్తిగత విషయాల్ని కూడా ప్రభాస్ షేర్ చేసుకుంటాడని, అతనంటే తనకు చాలా ఇష్టమని చెప్పడం ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది.