హీరో ప్రభాస్ ఫామ్ హౌస్‌కు సంబంధించిన స్థలంపై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలోని సర్వే నంబర్ 5/3 లోని 2083 చదరపు గజాల స్థలానికి సంబంధించి యదాతద స్థితిని కొనసాగించాలని హీరో ప్రభాస్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివాదం తేలే వరకు స్థలాన్ని ప్రభాస్‌కు స్వాధీనం చేయనవసరం లేదని, అలాగని అక్కడ వున్న ఫామ్ హౌస్‌ని ధ్వంసం చేయరాదని వెల్లడించింది.
ప్రభాస్ పెట్టిన పిటీషన్‌పై క్రింది కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఉత్తర్వుల్ని ఎత్తివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తును వీలైనంత త్వరగా పరిష్కరించాలని కింది కోర్టుని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎస్.చౌహాన్, జస్టీస్ పి. నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాయదుర్గంలోని సర్వే నంబర్ 5/3 లోని 2083 చదరపు గజాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారంటూ కూకట్‌పల్లి 15వ అదనపు జిల్లా జడ్జి వద్ద ప్రభాస్ పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన కూకట్‌పల్లి కోర్టు మార్చి 31న ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్ 3న ప్రభాస్ ఫామ్ హౌస్ తాళం తీయడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి శేరిలింగంపల్లి తాహశీల్దార్ ఫామ్ హైస్‌కి తాళం వేయడంతో ప్రభాస్ ఈ వివాదంపై ఇంజక్షన్ ఉత్తర్వుల్ని తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.