నయనతార రజినీకాంత్ కంటే ఎక్కువా?

Nayanathara
 
సంచలన నటి మాత్రమే కాకుండా, అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం డిమాండ్‌ చేస్తున్న నటిగానూ ఈ అమ్మడికి పేరుంది.
 
ఆ మధ్య యువ హీరోలతో జత కట్టిన నయనతార ఇప్పుడు వరుసగా స్టార్‌ హీరోలతోనే నటిస్తోంది. నటుడు విజయ్‌తో రొమాన్స్‌ చేసిన బిగిల్‌ (తెలుగులో విజిల్‌) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అదే విధంగా చిరంజీవితో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించింది. తాజాగా  దర్బార్‌ చిత్రంలో రజనీకాంత్‌తో జత కట్టిన  విషయం తెలిసిందే!  ప్రస్తుతం తన ప్రియుడిని నిర్మాతగా చేసి నెట్రికన్‌ అనే చిత్రంతో పాటు, ఆర్‌జే.బాలాజీ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న మూక్కుత్తి అమ్మన్‌ అనే భక్తిరస కథా చిత్రంలో నటిస్తోంది. ఈ రెండూ కథానాయకి పాత్రలకు ప్రాధ్యానత కలిగిన చిత్రాలే కావడం విశేషం.  
 
ఇలా నటిగా బిజీగా ఉన్న నయనతార ఆ మధ్య  ఒక టీవీ చానల్‌ నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని విమర్శలను కొని తెచ్చుకుంది.   నయనతార తాను నటించిన చిత్రాకు సంబంధించి ఎలాంటి  ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గనదనే విషయం తెలిసిందే. చిత్రంలో నటించామా, అంతటితో తన పని అయిపోయ్యింది అని సరిపెట్టుకుంటోంది. ఈ వ్యవహారంలో నయనతారపై చాలా కాలంగా అసంతృప్తి దర్శక నిర్మాతల్లో రగులుతోంది. అయితే అదంతా లోలోనే మండుతోంది. కారణం తను అగ్ర నటిగా వెలుగొందడం కావచ్చు.
 
అయితే..  కోట్ల పారితోషకం డిమాండ్‌ చేస్తూ నటిస్తున్న నయనతార ఆ చిత్రాల ప్రమోషన్‌కు మాత్రం రాదు గానీ, అవార్డుల అందుకోవడానికి మాత్రం రెడీ అవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్లలో పారితోషకం చెల్లిస్తున్న నిర్మాతల చిత్రాల వ్యాపారం కోసం చేసే కార్యక్రమాల్లో పాల్గొనవలసిన బాధ్యత నటీనటులకు ఉంటుందని, దాన్ని నయనతార విస్మయిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్, విజయ్‌ వంటి వారు కూడా తమ చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అలాంటిది నయనతార వారి కంటే ఎక్కువా? అనే చర్చ జరుగుతోంది!?