నాగార్జున మొదటి సినిమా ‘విక్రమ్’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తార శోభన. పూర్తి పేరు శోభన చంద్రకుమార్. పుట్టి పెరిగింది కేరళలోని తిరువనంతపురం. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించింది. కొన్ని టీవీ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. తెలుగులో ఆమె నటించిన రుద్రవీణ, అభినందన, నారి నారి నడుమ మురారి, రౌడీ గారి పెళ్ళాం, ఏప్రిల్ 1 విడుదల, కన్నయ్య కిట్టయ్య, రక్షణ వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. 2013 లో నటించిన మలయాళ చిత్రం ధిర తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ఉత్తమ నటిగా రెండుసార్లు జాతీయ అవార్డును అందుకుంది. ఈమె నటిగానే కాదు భరతనాట్య కళాకారిణిగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. భారత ప్రభుత్వం కళారంగానికి ఆమె చేస్తున్న సేవను గుర్తిస్తూ పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. కేరళ ప్రభుత్వం కళారత్న అవార్డును అందజేసింది. శోభన జాతీయంగానే కాదు అంతర్జాతీయ వేదికలపై నృత్య ప్రదర్శన ఇస్తూపేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.
శోభన వయస్సు 47 ఏళ్ళు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకపోవడంపై అనేక రూమర్లు వచ్చాయి. శోభన మలయాళ ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరోతో ప్రేమాయణం నడిపింది. కానీ ఆ హీరో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. అతని మీద ప్రేమని చంపుకోలేక సూసైడ్ అట్టెంప్ట్ చేసింది. ప్రేమ విఫలం అవడంతో మగవాళ్ళని నమ్మడం మానేసింది. అందుకే పెళ్ళికి దూరంగా ఉంది అనేది ప్రముఖంగా వినిపించే మాట. చాలా సంవత్సరాలు ప్రేమ పెళ్లి వంటి విషయాలకు దూరంగా ఉంది. ఇంట్లోవాళ్ళు, స్నేహితులు, సన్నిహితులు ఎంత నచ్చజెప్పినా తను మాత్రం పెళ్లి చేసుకోటానికి ఇష్టపడలేదు. కానీ పెళ్లి కాకపోయినా శోభన మాత్రం ఒక బిడ్డకి తల్లి అయ్యింది. జన్మ ఇవ్వకపోయినా 2010 లో ఒక ఆడపిల్లని దత్తత తీసుకుని తనకి అమ్మ ప్రేమని పంచింది. కేరళలో ప్రఖ్యాతిగాంచిన గురువాయూర్ ఆలయంలో అనంతనారాయణి అనే పేరుతో ఆమెకు నామకరణం చేసింది.
తాజాగా ఎవరూ ఊహించని వయస్సులో శోభన పెళ్లి చేసుకోబోతుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్త అన్ని వెబ్సైట్లలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఈ నటీమణి వివాహమాడబోతున్న వ్యక్తి ఎవరంటే తనకి బాగా తెలిసిన స్నేహితుడంట. వీరిద్దరికి చాలా ఏళ్లుగా పరిచయమున్నట్టు, ఆ వ్యక్తి శోభన కుటింబీకులకు కూడా బాగా తెలిసినవాడే అని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే శోభన స్పందించాలి కానీ ఆమె ఇప్పటి వరకు వీటిపై స్పందించలేదు. ఆమె అభిమానులు మాత్రం తను పెళ్లి చేసుకుని ఒక మంచి తోడుతో జీవనం సాగించాలని ఆశిస్తున్నారు. మరి వారి ఆశ తీరేనా? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం శోభన చేప్తేనే తెలుస్తుంది. కానీ చాలా సందర్భాల్లో ఆమె అన్నిటికంటే తన మొదటి ప్రాధాన్యత నృత్యానికి అని తెలియజేసింది. ప్రస్తుతం ఆమె తను స్థాపించిన నృత్య పాఠశాల కార్యకలాపాలను చూసుకుంటున్నారు.