Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఈయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా 100 కోట్ల క్లబ్లో చేరుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ ఏడాది కూడా డాకు మహారాజ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణ తన తదుపరి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక చివరిగా అఖండ సినిమా ద్వారా ఈ ఇద్దరు మంచి హిట్ అందుకున్నారు. త్వరలోనే అఖండ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్ పనులు కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మహా కుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బోయపాటి స్టార్ కాస్టింగ్ ను దించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ఖరారు కాగా, మరొక పాత్రలో మరో స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో ఒక సన్యాసి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన నటించబోతున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ శోభన కాంబినేషన్లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన శోభన కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈమె అఖండ 2 లో కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది.