గత కొంత కాలంగా తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. దర్శకులు ఇంతకు ముందు నేల విడిచి సాము చేసేవారు. కాలం మారింది ప్రేక్షకుల అభిరుచులు మారాయి. దీంతో ఆకాశం విడిచి నేలపైనే సాము చేయడం మొదలుపెట్టారు. అందువల్లే తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. నిజంలోకే తొంగిచూస్తోంది. వాస్తవికతకే అద్ధంపడుతోంది. దీంతో కొత్త తరహా సినిమాలు వస్తున్నాయి. ఇటీవల `మహర్షి`తో దేశానికి కావాల్సింది కార్పెరేట్‌లు కాదు హలం పట్టి పొలం దున్ని పదిమందికి అన్నంపెట్టే రైతన్న అని చాటి చెప్పారు. తాజాగా ఇదే స్టైల్ లో రైతు గురించి, సేంద్రియ సేద్యం గురించి మరో సినిమా వస్తోంది.
నితిన్ నటిస్తున్న తాజా చిత్రం `భీష్మ`. వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. టీజర్‌లో అమ్మాయిలంటే పడిచచ్చే రోమియోగా, వాళ్లని దూరంపెట్టే యువకుడిగా నితిన్ కనిపించాడు. సోమవారం రిలీజ్ చేసిన ట్రైలర్‌లో మాత్రం అసలు కథని రివీల్ చేసేశారు. `భీష్మ` అనే పేరుతో సేంద్రియ వ్యవసాయాన్ని ఓ ఉద్యమంలా హీరో నడిపిస్తున్నట్టు అర్థమవుతోంది. అతనికి అడుగడుగునా అడ్డుతగిలే ఓ కార్పొరేట్ విలన్.. వీరిద్దరికీ మధ్య జరిగే కార్పెరేట్ వార్ నేపథ్యంలో మంచి సందేశాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
ఇందులో నితిన్ సాఫ్ట్‌గా కనిపిస్తూనే విలన్‌లపై విరుచుకుపడుతున్న తీరు, మరో పక్క హీరోయిన్‌తో రొమాన్స్, కామెడీ…ఇలా సమపాళ్లలో `భీష్మ`ని ఓ ఫుల్ మీల్స్‌లా ఆడియన్స్‌కి సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ `అఆ`లో నితిన్ ఎంత మెచ్చూర్డ్‌గా కనిపించాడో అంతే మెచ్చూర్డ్‌గా, అంతే స్టైలిష్ గా ఈ చిత్రంలోనూ కనిపిస్తున్నాడు. ఓవరాల్‌గా చూస్తుంటే బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టేలా వుంది. సినిమాలో `భీష్మ` కంపెనీకి, నితిన్ క్యారెక్టర్‌కి వున్న సంబంధం ఏంటన్నది తెలియాలంటే ఈ నెల 21 వరకు వేచి చూడాల్సిందే.