‘2.0’ చైనా రిలీజ్, ఓపినింగ్స్ ఎలా ఉన్నాయి?
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘2.0’ చిత్రం నిన్న శుక్రవారం(సెప్టెంబర్ 06) చైనాలో విడుదలైంది. చైనీస్ భాషలోకి డబ్బింగ్ చేసిన వర్షన్‌తో పాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో రూపొందించిన వర్సన్‌ను కూడా చైనాలో రిలీజ్ చేసారు. సినీ నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది.
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం 2018లో భారత్‌లో విడుదలైంది. సినిమా హిట్ అనిపించుకున్నా అందుకు తగ్గ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయితే ఇక్కడ మన దేశంలో రిలీజ్ సమయంలో చైనాలోని 48000 థియేటర్లలో విడుదల చేయాలనుకున్నప్పటికీ.. ‘ది లయన్ కింగ్’ విడుదల వల్ల ఈ సినిమా వాయిదా వేసారు. ఆ గ్యాప్ తర్వాత థియోటర్స్ దొరక్క ఇన్నాళ్ళూ వెయిట్ చేసారు. ఇప్పుడు చైనా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులను సృష్టిస్తుందని చిత్ర నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేసారు.
వారి అంచనాలకు తగ్గట్లే మొదటి రోజు $1.4 మిలియన్స్ రాబట్టింది. అది ఈ సినిమాకు మంచి ఓపినింగే. అయితే అక్కడ స్టడీగా కలెక్షన్స్ ఉంటే భారీ రిలీజ్ కు తగ్గట్లు కలెక్షన్స్ ఉంటాయి. గతంలో మన సినిమాలు అక్కడ బాగానే పే చేసాయి. ఈ సినిమాలో కాన్సెప్టు చైనా వారికి కూడా నచ్చిందని అక్కడ రివ్యూలు వస్తున్నాయి. దాంతో చైనా నుంచి లైకా సంస్ద బాగానే ఎక్సపెక్ట్ చేస్తోంది.
రజనీ కాంత్ ఈ చిత్రంలో చిట్టి, వశీకరణ్ అనే పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ బాణీలు అందించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ విలన్ పాత్రలో కనిపించారు. నటి అమీ జాక్సన్ ఇందులో హీరోయిన్. 2010లో వచ్చిన రోబో చిత్రానికిది కొనసాగింపుగా వచ్చింది.