భారత మాజీ రాష్ట్రపతి, సైంటిస్ట్, ఆదర్శభావాలతో జాతికి స్ఫూర్తిగా నిలిచిన ఏపీజే అబ్దుల్ కలామ్ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్‌ని హడావిడిగా మొదలుపెట్టారు. అలీని కలామ్‌గా చూపిస్తూ జగదీష్ అనే ఓ వ్యక్తి ఇండో అమెరికన్ చిత్రంగా హాలీవుడ్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ బయోపిక్ చుట్టు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఢిల్లీలో రిలీజ్ చేశారు.
దీంతో అబ్దుల్ కలామ్ పై బయోపిక్‌ని నిర్మించే సర్వహక్కుల్ని సొంతం చేసుకున్న అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర మీడియా కెక్కారు. అబ్దుల్ కలామ్ పై డాక్యుమెంటరీ నుంచి ఫీచర్ ఫిల్మ్ వరకు సర్వహక్కులు తమకే వున్నాయని, అలా కాకుండా మరొకరు అబ్దుల్ కలామ్ పై సినిమా తీసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇవేవీ పట్టనట్టుగా తెలివిగా పొలిటికల్ వర్గాలని ఈ ప్రాజెక్ట్‌లో ఇన్ వాల్వ్ చేస్తూ జగదీష్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో అభిషేక్ అగర్వాల్ లీగల్ గా జగదీష్‌కు నోటీసులు పంపించాలని నిర్ణయించుకోవడంతో అబ్దుల్ కలామ్ బయోపిక్ వివాదంగా మారింది. హాలీవుడ్ సినిమా చేయాలన్న తన కల ఇలా వివాదాల మయం కావడంతో అలీ తలపట్టుకుంటున్నాడట.