ఒక సీక్వెల్‌ని చేయాలంటే దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సీక్వెల్స్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. `చంద్రముఖి` సీక్వెల్ అంటూ విక్టరీ వెంకటేష్‌తో పి. వాసు చేసిన `నాగవల్లి` దర్శకుడిని, హీరో వెంకటేష్‌నీ నవ్వులు పాలయ్యేలా చేసింది. రజనీ శిష్యుడిగా ఆకట్టుకోవాలని వెంకీ ఎంతగా ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు సరికదా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యేలా చేసింది.
మళ్లీ ఇన్నాళ్లు `చంద్రముఖి 2` తీస్తానంటూ పి. వాసు హడావిడి మొదలుపెట్టారు. రజనీ అయితే ఓకే కానీ మళ్లీ అదే తప్పు చేస్తూ రాఘవ లారెన్స్ ని హీరోగా తీసుకుని చేయబోతున్నాడు. సీక్వెల్‌లో నటించడానికి పర్మీషన్ కూడా తీసుకున్నానని లారెన్స్ చెబుతున్నాడు. పులి చేయాల్సింది పులే చేయాలి అప్పుడే అందం.. అలా కాకుండా మరోటి ఆ పని చేస్తానంటే జనం నవ్వుకుంటారు.
ఇది వెంకటేష్‌తో రీమేక్ చేసిన `నాగవల్లి` విషయంలో రుజువైనా కూడా దర్శకుడు పి. వాసులో ఏ మాత్రం మార్పు రాలేదు. రజనీ కాదంటే ఆ స్థాయి నటుడు ఎవరున్నారో చూసి వారితో ఆ సినిమా చేస్తే దానికో స్థాయి వుంటుంది. అలా కాకుండా ఎవరు దొరికితే వారితో చేస్తానంటే జనం నవ్వుకోవడం గ్యారంటీ అని కోలీవుడ్‌లో సెటైర్లు వినిపిస్తున్నాయి.