గీతా ఆర్స్ట్ పేరుతో అమ్మాయిల‌కు వ‌ల‌

టాలీవుడ్ పేరుతో జ‌రిగే ఘ‌రానా మోసాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోల ఫేక్ అకౌంట్ల‌తో, నిర్మాణ సంస్థ‌ల ఫేక్ అకౌంట్లు పేరు చెప్పి డ‌బ్బులు కాజేసే బ్యాచ్ లు చాలానే ఉన్నాయి. సైబ‌ర్ క్రైమ్ పేరుతో కోట్ల రూపాయాలు లూటీ చేసిన ఘ‌రానా దొంగ‌లు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్స్ట్ పేరుతో ఓ ప్ర‌బుధ్దుడు అంద‌మైన అమ్మాయిల‌కు ఎర వేసాడు. బ‌న్నీ పేరు చెప్పుకుని వాళ్ల‌ను వంచించాడు. గీతా ఆర్స్ట్ లో తాను డిజైన‌ర్, మేక‌ప్ మెన్ అని చెప్పుకుని అమ్మాయిల‌తో చాటింగ్ చేసాడు. సినిమాల ప‌ట్ల ఆస‌క్తి ఉన్న అంద‌మైన అమ్మాయిలంద‌ర్నీ ఫేస్ బుక్ ఆధారంగా వాళ్ల వివ‌రాలు సేక‌రించి ఎర వేసాడు.

గీతా ఆర్స్ట్ బ్యాన‌ర్లో సినిమా ఛాన్స్లు ఇప్పిస్తాన‌ని, అల్లు అర్జున్  స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ నీకే ఉందంటూ మాయ మాట‌లు చెప్పాడు. దీంతో కొంత మంది అమ్మాయిలు అత‌ని మాట‌ల్ని న‌మ్మి మోస‌పోయారు. అత‌ను హోట‌ల్, పార్టీలు, ప‌బ్ లు అంటూ ఆ యువ‌త‌ల్ని అన్ని రకాలుగా మోసం చేసిన‌ట్లు స‌మాచారం. అదే సంస్థ పేరుతో కొన్ని డ‌మ్మీ అకౌంట్ల‌ను క్రియేట్ చేసి డ‌బ్బు వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలిసింది. తాజాగా ఈ విష‌యం గీతా ఆర్స్ట్ యాజ‌మాన్యం దృష్టికి వెళ్లింది. సంస్థ అధినేత అల్లు అర‌వింద్ అదేశాల మేర‌కు ఆ సంస్థ మేనేజ‌ర్ స‌త్య సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్ర‌యించాడు. పోలీసులు కేసు న‌మోదు చేసి అత‌ను చాటింగ్ ఆధారంగా వెతికి ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇటీవ‌లే ఇలాంటి వివాదం ఒక‌టి తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి పేరుతో కొంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా అమ్మాయిల‌కు ఎర వేసిన‌ట్లు పోలీసుల ఫిర్యాదులో ఉంది. దీంతో తాజా కేసుకు..ఈకేసుకు ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. అయితే అమ్మాయిల తో మాట్లాడిన వ్య‌క్తి కేవ‌లం వాట్సాప్ ద్వారానే చాటింగ్, వీడియో కాల్స్ చేసిన‌ట్లు తెలిసింది. దీంతో పోలీసులు దాని ఆధారంగానే ఆ వ్య‌క్తి లోకేష‌న్ ని ట్రేస్ చేసే ప‌నిలో ప‌డ్డారు.