కోలీవుడ్‌లో ముదురుతున్న వివాదం!

సినిమా క‌ష్ట‌కాలం..ఇంకెన్నాళ్లో? దేవుడికే ఎరుక‌!

కోలీవుడ్‌లో థియేట‌ర్ల సంఘాల‌కూ నిర్మాత‌ల‌కూ మ‌ధ్య వివాదం ముదురుతోంది. హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థ నిర్మించే సినిమాపై త‌మిళ‌నాడు థియేట‌ర్స్ యాజ‌మాన్యం నిషేధం విధుస్తూ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. సేర్య త‌న భార్య జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌లో సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌పై `పోన్ మ‌గ‌ల్ వంద‌ల్‌` అనే చిత్రాన్న నిర్మించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్నిఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఈ నిర్ణ‌యంపై పునః ప‌రిశీలన చేసుకోవాల‌ని త‌మిళ‌నాడు థియేట‌ర్స్ యాజ‌మాన్యం సూర్య‌ని కోరింది. ఈ నిర్ణ‌యాన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ మార్చుకునేది లేద‌ని సూర్య ఖ‌చ్చితంగా చెప్ప‌డంతో థియేట‌ర్స్ యాజ‌మాన్యం థియేట‌ర్ల‌లో కాకుండా ముందుగా ఓటీటీ ప్లాట్ ఫాంల‌లో రిలీజ్ చేస్తే స‌హ‌క‌రించేది లేద‌ని, ఇక నుంచి 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించే చిత్రాల్ని థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌కుండా నిషేధిస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

తాజాగా త‌మిళ‌నాడు థియేట‌ర్స్ యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ సూర్య‌కు మ‌ద్ద‌తుగా 30 మంది నిర్మాత‌లు ముందుకొచ్చారు. దీంతో థియేట‌ర్స్ యాజ‌మాన్యం వ‌ర్సెస్ నిర్మాత‌లుగా మారిపోయింది. ఇది చిలికి చిలికి పెను వివాదంగా మార‌డం ఖాయ‌మ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న సూర్య చిత్రం `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` చిత్రానికి కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైతే వివాదం మ‌రింత ముద‌ర‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని కోలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.