ఈ టైమ్ ఏంటీ మంచు విష్ణు చేస్తున్న‌దేంటీ?

ఊరంతా కాలిపోతుంటే ఆ మంట‌ల్లో ఒక‌డు చ‌లికాచుకున్నాడ‌ట అన్న‌ట్టుగా వుంది మంచు విష్ణు వ్య‌వ‌హార శైలి. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో యావ‌త్ ప్ర‌పంచం ఉక్కిరిబిక్కిరి అవుతూ క్ష‌ణ‌మొక యుగంలా కాలం వెళ్ల‌దీస్తోంది. ఈ ఉప‌ద్ర‌వం నుంచి ఏ దేవుడైనా ర‌క్షించ‌క‌పోతాడా? లేక ఏ సైంటిస్ట్ అయినా క‌రోనా వైర‌స్‌కు విరుగుడుని క‌నిపెట్ట‌క‌పోతాడా? అని యావ‌త్ ప్ర‌పంచం ఎదురుచూస్తోంది. ఇట‌లీ, స్పెయిన్‌లో ప్ర‌జ‌లు దీని ధాటికి పిట్ట‌ల్లా రాలిపోతున్నారు.

కంటికి క‌నిపించ‌ని వైర‌స్‌పై ప్ర‌పంచ దేశాల‌న్ని యుద్ధం చేస్తున్నాయి. త‌మ దేశ ప్ర‌జ‌ల‌ని కాపాడుకోవాల‌ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. లాకౌట్‌ని ప్ర‌క‌టించి జ‌నం ఇళ్ల నుంచి బ‌య‌టికి రాన‌ప్ప‌డే క‌రోనా వైర‌స్‌ని అదుపు చేయ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌భుత్వాలు లాక్ డౌన్‌ని అమ‌లు చేస్తున్నాయి. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లంతా భ‌యంతో పానిక్ అవుతుంటే మంచు విష్ణు త‌న కొత్త సినిమా రిలీజ్ డేట్‌ని మ‌రీ ఇంత ఎర్లీగా ఈ వేళ ప్ర‌క‌టించ‌డ‌మే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న చిత్రం `మోస‌గాళ్లు`. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఐటీ స్కామ్ నేప‌థ్యంలో ఇండో హాలీవుడ్ చిత్రంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కాజ‌ల్ అగర్వాల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. సునీల్ శెట్టి, న‌వ‌దీప్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కొంత షూటింగ్ మిన‌హా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యింది. ఏప్రిల్‌లో బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని పూర్తి చేసి చిత్రాన్ని జూన్ 5న రిలీజ్ చేయాల‌ని మంచు విష్ణు ప్లాన్ చేశాడు. దీనిపై స‌ర్వ‌త్రా సెటైర్లు వినిపిస్తున్నాయి. జూన్‌లో రిలీజ్ కాబోయే సినిమాకు ఇప్పుడు రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించ‌డ‌మే విడ్డూరంగా వుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.