లాక్ డౌన్ నేపథ్యంలో స్టార్ హీరోల అభిమానులు సామాజిక సేవా కార్యక్రమల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఈ అభిమానం కోలీవుడ్ లో హద్దు మీరింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం తో ఓ అభిమాని మృతి చెందాడు. దీంతో కోలీవుడ్ టెన్షన్ వాతావరణం అలుముకుంది. దీంతో కరోనా వైరస్ పరోక్షంగా ఓ అభిమాని ప్రాణాన్ని తీసుకున్నట్లు అయింది. వివరాల్లోకి వెళ్తే… తమిళనాడు హీరోల పట్ల అభిమానులు ఎలా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. హీరోపై అభిమానంతో ప్రాణం సైతం లెక్క చేయగని మొండి అభిమానం వాళ్లది. కోట్లాటలు..కత్తులతో దాడి చేసుకోవడం అక్కడ చాలా సహజం.
తమ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే? జరిగే హంగామాలో కచ్చితంగా దాడులు చోటు చేసుకుంటాయి. అలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. లాక్ డౌన్ వేళ తమిళనాడు విల్లాపురం జిల్లా మరక్కానంకు చెందిన యువరాజు విజయ్ అభిమాని. అతడి మిత్రుడు దినేష్ బాబు రజనీకాంత్ అభిమాని. ఇద్దరు మంచి మిత్రులుగా ఉండేవారు. హీరోలపై ఉన్న అభిమానమే ఇద్దరి మధ్య చిచ్చు రేపింది. గురువారం ఇద్దరి మధ్య కరోనా గొడవ జరిగింది. తమ హీరో అంటే తమ హీరోనే ఎక్కువ విరాళంగా అందించాడని వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన దినేష్ బాబు, యువరాజ్ ని వెనక్కి తొసేసాడు.
యువరాజు కింద పడటంతో అక్కడున్న రాయి తలకి బలంగా తగిలింది. దీంతో వెంటనే యువరాజు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో దినేష్ బాబు అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసారు. కాగా శుక్రవారం దినేష్ బాబు ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలోనూ విజయ్- అజిత్ అభిమానులు కత్తులతో దాడులు చేసుకున్న సంఘటనుల్నాయి. మొత్తానికి కరోనా ఈ రకంగాను మనుషుల్ని వదిలిపెట్టలేదు.