సినిమాలకు కరోనా బీమా ఉంటుందా? అది సాధ్యమేనా? అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు పరిశ్రమలో జోరుగా సాగుతుంది. ఇప్పటివరకూ సినిమాలకు బీమా సౌకర్యం ఉంది. కానీ దీనికి కొన్ని నిబంధనలున్నాయి. సెట్స్ కు జరిగే నష్టం, కెమెరాలు ధ్వసం అయితే లేదా? అందులో పాజిటివ్ పాడైతే పరిహారం కోరే వీలవుతుంది. అలాగే ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు నిర్మాత బీమా చేయిస్తారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగి చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటని భావించి నిర్మాతలే బీమా చేయించాల్సి ఉంటుంది. ఇటీవలే కమల్ హాసన్ భారతీయుడు -2 షూటింగ్ లో ఓ టెక్నీషియన్ మృతి చెందితే ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే.
ఆ ఘటన తర్వాత సినిమాలు నిర్మించే నిర్మాతలంతా షూటింగ్ కు వచ్చే వారందరికీ బీమా తప్పక చేయించాలని డిమాండ్ చేయడంతో తప్పలేదు. మరి ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో షూటింగ్ జరుగుతుంది. మరి దీనికి బీమా ఉంటుందా? అంటే నిర్మాతలు ఆ విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం షూటింగ్ కి వచ్చే వారందరికి భద్రత ఉండాలని సూచించింది. దీంతో నిర్మాతలు కరోనా బీమా కూడా చేయిస్తున్నట్లు సమాచారం. అయితే కరోనా వల్ల నిర్మాతకు నష్టం ఎదురైతే బాధ్యత వహించేది ఎవరు? అన్నది తేలలేదు. కరోనా సోకి ఆర్టిస్టులు, టెక్నీషీయన్లు షూటింగ్ కి రాకపోతే తీవ్రంగా నష్టపోక తప్పదు నిర్మాతలు.
కోట్ల రూపాయలు ఖర్చు చేసే సినిమాలు మధ్యలోనే నిలిచిపోతాయి. అప్పుడు వారిని ఆదుకునేది ఎవరు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు నిర్మాతల్ని వెంటాడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఎంతో రిస్క్ తీసుకుని నిర్మాత సినిమా మీద ఖర్చు పెడుతున్నట్లు లెక్క. అంతా సవ్యంగా జరిగి సినిమా మంచి బిజినెస్ అయితే పర్వాలేదు. అలా కాకుండా మధ్యలో ఎక్కడ తేడా జరిగినా నిర్మాత రోడ్డున పడాల్సిందే. ఈ నేపథ్యంలో సినిమాకి కరోనా బీమా అనేది ప్రభుత్వం కల్పించాలని పలువురి కోరుతున్నారు.