రానా కోసం నందిత వ‌చ్చేసింది!

`నీది నాది ఒకే క‌థ‌` ఫేమ్ వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. రానా, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లో పీపుల్స్ వార్ ఉద్య‌మానికి సంబంధించిన కీల‌క సంఘ‌ట‌న‌లు 1992 కాలంలో జ‌రిగి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. ఆ సంఘ‌ట‌న‌ల్లో బెల్లి ల‌తిత హ‌త్యోదంతం ఒక‌టి. జాన‌ప‌ద క‌ళాకారిణి అయిన బెల్లి ల‌లిత‌ను అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. దీని వెన‌కున్న కీల‌క అంశాల‌తో పాటు న‌క్సలైట్ ఉద్య‌మానికి సంబంధించిన కీల‌క అంశాల‌ని ఈ చిత్రంలో చ‌ర్చిస్తున్నార‌ట‌.

హీరో రానా ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్తుగా న‌టిస్తున్నారు. గ్రామీణ యువ‌తిగా న‌క్స‌లిజానికి స‌హ‌క‌రించే వ్య‌క్తిగా స‌యి ప‌ల్ల‌వి పాత్ర వుంటుంద‌ని తెలుస్తోంది. ఆమె పాత్ర‌ బెల్లి ల‌తితను పోలి వుండే అవ‌కాశాలే ఎక్కువ‌గా కనిపిస్తున్నాయ‌ని, ఓ పోలీస్ ఆఫీస‌ర్‌, న‌క్స‌లైట్ మ‌ధ్య సాగే మృద్య‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని వేణూ ఊడుగుల రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. విషాదాంత‌పు ప్రేమ‌క‌థ‌గా ఈ సినిమా వుంటుద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రంలోని కీల‌క పాత్ర అయిన మాన‌వ హ‌క్కుల నేత పాత్ర‌లో బాలీవుడ్ న‌టి నందితా దాస్ క‌నిపించ‌బోతోంది.

మంగ‌ళ‌వారం నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ విష‌యాన్ని టీమ్ వెల్ల‌డిస్తూ సెట్‌లో ఆమెకు సంబంధించిన ఫొటోల‌ని రిలీజ్ చేసింది. `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` ఫేమ్‌ సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి `మ‌హాన‌టి`కి కెమెరామెన్‌గా వ‌ర్క్ చేసిన డానీ సంచెజ్ లోపెజ్ ప‌ని చేస్తున్నారు. స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు.