టీడీపీ నేతల్లో ఎంపీ కేశినేని నాని రూటే సపరేటు. అందరు నేతలు అధికార పక్షం మీద ఒక విధంగా యుద్దం చేస్తే ఆయన మాత్రం ఇంకోలా ఫైట్ చేస్తుంటారు. లోకల్ విషయాల్ని గట్టిగా పట్టుకుని వైఎస్ జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తుంటారు. అయన ప్రశ్నలకి అధికార పక్షం సమాధానాలు వెతుక్కోవలసిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నేతల మీద విరుచుకుపడిన ఆయన తాజాగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఎక్కవ దృష్టి పెట్టారు.
ఇంతకుముందు వెల్లంపల్లి విజయవాడలోని వ్యాపారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇదంతా బెదిరింపుల ద్వారానే జరుగుతోందని ఆరోపణలు చేశారు. దానికి వెల్లంపల్లి సమాధానం ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఇలా అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ వివాదంతో ఇరివురి మద్య కాక మొదలైంది. ఇక తాజాగా వెల్లంపల్లి దుర్గ గుడి ఉద్యోగుల కార్యాలయ ప్రాంగణంలో వైకాపా నేతలు, ఎన్నికల్లో పాల్గొనవలసిన నేతలతో సమావేశం పెట్టుకున్నారు.
ఇది తెలుసుకున్న కేశినేని నాని వ్యాపారస్తుల్ని బెదిరించి దండుకుంటున్నావు, దుర్గ గుడి మొత్తం దోచేస్తున్నావు, వినాయకుడి గుడిని నాకేశావు అంటూ ధ్వజమెత్తారు. అంతేకాదు గతంలో ఆలయ ప్రసాదాలను అధికార పార్టీ అభ్యర్థులు డివిజన్లలో పంచిపెట్టారనే ఆరోపణల్ని కూడా ప్రస్తావించారు. దీంతో ఇరువురి నడుమ మళ్లీ వార్ మొదలైంది. వెల్లంపల్లి సమాధానం ఇస్తూ ఇది రాజకీయ సమావేశం కాదని పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈ మీటింగ్ అంటూ సమర్థించుకున్నారు.
కానీ జనం మాత్రం పార్టీ అభ్యర్థులతో మీటింగ్ పెట్టి పొలిటికల్ మీటింగ్ కాదంటారేమిటి, అసలు గుడి ప్రాంగణాన్ని రాజకీయ నేతలు సొంత కార్యకలాపాలకు వాడటం దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు.